నీ వెంటే మేము..

13 Nov, 2018 06:57 IST|Sakshi
ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి

ప్రజా సంకల్పయాత్ర బృందం :ఎవరెన్ని కుట్రలు పన్నినా... కుయుక్తులు వేసినా వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ఏమీ చేయలేరు. ఆయనకు రక్షణగా మేమున్నాం.. ప్రజాబలం ముందు చేతకాని రాజకీయాలు దిగదుడుపే.. దాడులు చేసినా.. అభాండాలు వేసిన జననేతను రక్షించుకుంటామని శపథం చేశారు మక్కువ మండల వాసులు. కొన్ని దుష్టశక్తుల ప్రోద్బలంతో జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో గత నెలలో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే.  ఈ సంఘటనతో నిలిచిపోయిన ప్రజా సంకల్పయాత్రను కొద్ది విరామం తర్వాత అదే ఉత్సాహంతో మళ్లీ మక్కువ మండలంలోని పాయకపాడు వద్ద సోమవారం ప్రారంభించారు ప్రతిపక్ష నేత. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. మేడలు, మిద్దెలు, వాటర్‌ ట్యాంకులు, చెట్లు ఎక్కి మరీ జగన్‌మోహన్‌రెడ్డిని చూశారు. భావి ముఖ్యమంత్రివి నీవే అంటూ  నినాదాలు చేశారు. దారి పొడవునా ప్రతి ఒక్కరి సమస్య వింటూ.. భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు జగన్‌మోహన్‌రెడ్డి.                    

అగ్రిగోల్డ్‌ సొమ్ము రాలేదు...
 పిల్లల భవిష్యత్‌ కోసం అగ్రిగోల్డ్‌లో సొమ్ము దాచుకున్నాం. మేము కట్టింది కాక మరో 30 మందితో సుమారు 30 లక్షలు సంస్థలో డిపాజిట్‌ చేయించాం. సంస్థ బోర్డు తిప్పేశాక మమ్మల్ని ఆదుకోవాలని ఎన్నోసార్లు ధర్నాలు, ఆందోళనలు చేశాం. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవాలని కోరాం.– పట్నాన శారద, కొండబుచ్చంపేట  

 వైఎస్‌ హయాంలో ఉచిత వైద్యం..
మాది కన్నంపేట. నేను క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నాం. గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా క్యాన్సర్‌కు వైద్య సేవలు అందేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఆస్పత్రికి వెళ్తున్నప్పుడల్లా పది వేల రూపాయల చొప్పున ఖర్చవుతోంది. జగన్‌మోహన్‌రెడ్డికి  నా సమస్య వివరించాను. జగన్‌బాబు ముఖ్యమంత్రి అయ్యాక నాలాంటి వారిని ఆదుకోవాలి.– బొబ్బిలి అప్పలనరసమ్మ, కన్నంపేట  

పింఛన్‌ ఇవ్వనంటున్నారు..
నా కొడుకు కలిశెట్టి ప్రసాదరావు చనిపోయి ఆరేళ్లయింది. నా కోడలు గోవిందమ్మకు వితంతు పింఛన్‌ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదు. నాకు వృద్ధాప్య పించన్‌ ఇస్తున్నారు. ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు ఇవ్వనంటున్నారు. నేను, నా కోడలు కూలి పనులకు వెళ్తేనే ఇల్లు గడిచేది. సమస్యను జగన్‌మోహన్‌రెడ్డికి వివరించాను. ఆయన ముఖ్యమంత్రి అయితే మాలాంటి వారికి న్యాయం జరుగుతుంది.– కలిశెట్టి సింహాచలం, దబ్బగడ్డ, మక్కువ మండలం

>
మరిన్ని వార్తలు