నిండైన భరోసా

13 Dec, 2018 07:49 IST|Sakshi
జగన్‌తో కలిసి నడుస్తున్న ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి, దువ్వాడ శ్రీనివాస్, మామిడి శ్రీకాంత్, మాజీ ఐపీఎస్‌ ఇక్బాల్‌

సమస్యలను వింటూ ముందుకు సాగుతున్న జగన్‌మోహన్‌ రెడ్డి

ఆమదాలవలస నియోజకవర్గంలో ముగిసిన పాదయాత్ర

కళింగ వైశ్యులకు ఎమ్మెల్సీ హామీపై హర్షం  

శ్రీకాకుళం ,అరసవల్లి: జన క్షేమమే ధ్యేయంగా, విశ్వసనీయతే ఆయుధంగా సాగుతున్న ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. రాజన్న బిడ్డ తమ ఊరికి వస్తున్నాడంటూ సంబరాలు చేసుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా వందలాది మంది జనం తరలిరావడంతో ఆమదాలవలస ప్రాంతమంతా జనజాతరైంది. భానుని ప్రతాపం పెరుగుతున్న, అలుపెరగని యోధుడిలా జగన్‌ ఉత్సాహంగా ముందుకు సాగుతూ ప్రజలకు భవిష్యత్‌ భరోసాను ఇచ్చారు. ఆయన వెంట వందలాది మంది అడుగులు కలిపి మద్దతు పలికారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల పరిధిలో బుధవారం జరిగిన యాత్ర ఉత్సాహంగా సాగింది. ఇల్లు లేదని ఓ మహిళ, పింఛన్‌ అందడం లేదంటూ ఓ దివ్యాంగుడు, చదువుకునేందుకు ఆర్థిక ఇబ్బందులున్నాయంటూ మరో సోదరి ఇలా.. అడుగడుగునా వివిధ రకాల సమస్యలతో జగన్‌ ముందు తమ గోడును చెప్పుకున్నారు. ప్రతి సమస్యను జగనన్న ఓపిగ్గా వింటూ భవిష్యత్‌కు భరోసా కల్పించారు. అలాగే యాత్ర పొడవునా పల్లె జనం జగన్‌కు హారతులు పట్టారు. 

బుధవారం మధ్యాహ్న సమయానికి ఆమదాలవలస నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి కాగా, శ్రీకాకుళం నియోజకవర్గంలో యాత్ర కొనసాగింది. పలు సామాజిక వర్గాలకు జగన్‌ వరాల జల్లు కురిపించడంతో ఆయా వర్గాల్లో ఆనందాలు వ్యక్తమయ్యాయి. అలాగే ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే నరేష్‌కుమార్‌ అగర్వాలా (లల్లూ) బుధవారం ఉదయం జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇచ్ఛాపురం సమన్వయకర్త పిరియా సాయిరాజ్‌ తదితరుల సమక్షంలోనే జగన్‌ లల్లూకి పార్టీ కండువాను కప్పారు. ఆయనతో పాటు మాజీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ లాభాల స్వర్ణమణి తదితరులు కూడా పార్టీలో చేరారు.

సుగర్‌ ఫ్యాక్టరీ ప్రాంతంలో ఉత్సాహంగా..
స్థానికంగా మూతబడిన సుగర్‌ ఫ్యాక్టరీ ప్రాంతంతో పాటు వంశధార వయాడెక్ట్‌ల మీదుగా బుధవారం జగన్‌ ఎంతో ఉత్సాహంగా యాత్ర కొనసాగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ హయాంలో నిర్మించి, ప్రారంభించిన వంశధార వయాడెక్ట్‌తో లబ్ధి పొందిన రైతులంతా పెద్ద సంఖ్యలో జగన్‌ వెంట నడిచి, దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. అలాగే ఆమదాలవలసలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో సుగర్‌ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తానని జగన్‌ ఇచ్చిన హామీకి కూడా రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే మళ్లీ ఇక్కడే సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తానని జగన్‌ హామీ ఇచ్చిన మర్నాడే అదే ఫ్యాక్టరీ మార్గంలోనే యాత్ర చేస్తూ రైతుల కుటుంబాలతో పాటు ఆయా ప్రాంత ప్రజలను కలుసుకోవడం ప్రత్యేకంగా కనిపించింది.

కళింగ వైశ్యులకు ఎమ్మెల్సీతో పాటు ప్రత్యేక కార్పొరేషన్‌
కళింగ వైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని జగన్‌ ప్రకటించడంతో జిల్లా వ్యాప్తంగా వైశ్య వర్గాల్లో హర్షం వ్యక్తమైంది. బుధవారం కళింగ వైశ్య రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు వరం, పార్టీ సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, కోణార్క్‌ శ్రీను తదితర బృంద మంతా కలిసి జగన్‌ను కలిసి తమ వినతులను అందజేశారు. దీనిపై జగన్‌ స్పందిస్తూ ఓబీసీలో చేర్పించేందుకు కూడా అడుగులు వేస్తామని, ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇదే కులానికి చెందిన వారికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి కేంద్రంలో ఓబీసీ జాబితాలో చేర్పించే పనులను చూసేలా చేస్తానని జగన్‌ హామీ ఇవ్వడంతో వారంతా జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కాళింగ సామాజిక ప్రతినిధులు కూడా జగన్‌ను కలిసి వినతులు అందజేశారు.

పాదయాత్ర సాగిందిలా
ఆమదాలవలస సమీపంలో కృష్ణాపురం నుంచి బుధవారం ఉదయం ప్రారంభమైన పాదయాత్ర పురుషోత్తంపురం క్రాస్, మెట్టక్కివలస, ఊసవానిపేట వరకు సాగిన యాత్ర ఆమదాలవలస నియోజకవర్గంలో యాత్ర ముగించి, మళ్లీ శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని రెడ్డిపేట క్రాస్, కొత్తవానిపేట, భైరవానిపేట, నక్కవానిపేట క్రాస్‌ వద్దకు చేరింది. యాత్ర పొడవున జనం పెద్ద సంఖ్యలో జగన్‌ను చూసేందుకు తరలివచ్చారు. తమ అభిమాన నేత కళ్ల ముందుకు రావడంతో జనమంతా జగన్‌కు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఇక మహిళలు అధికంగా పాల్గొని జగన్‌కు ఘనంగా నీరాజనం పలికారు.

పాదయాత్రలో పాల్గొన్న నాయకులు
పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి, శ్రీకాకుళం పార్లమెంట్‌ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రయ్య, పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, విజయవాడ పార్లమెం ట్‌ సమన్వయకర్త ఇక్బాల్, కీలక నేతలు పెనుమత్స సాంబశివరాజు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఇచ్ఛాపురం సమన్వయకర్త పిరియా సాయిరాజ్, సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, జెడ్పీ మాజీ చైర్మన్‌ వైవీ సూర్యనారాయణ, జెడ్పీటీసీ చిట్టి జనార్ధనరావు యువనేత తమ్మినేని చిరంజీవినాగ్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు