‘సంకల్పానికి’ ప్రజా అండ

25 Nov, 2017 06:16 IST|Sakshi

తండోపతండాలుగా వచ్చి వైఎస్‌ జగన్‌కు సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలు

నంద్యాల పార్లమెంట్‌లో యాత్ర విజయవంతం

జిల్లాలో డిసెంబర్‌ నాలుగో తేదీ వరకు కొనసాగనున్న పాదయాత్ర

వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు బీవై రామయ్య, గౌరు వెంకటరెడ్డి

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు జిల్లాలో విశేషమైన స్పందన లభిస్తోందని పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల భరత్‌కుమార్‌రెడ్డితో కలసి ప్రజా సంకల్ప పాదయాత్ర వాల్‌ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పాదయాత్రలో రైతులు, మహిళలు, రైతు కూలీలు, వృద్ధులు, యువకులు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్‌/అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, చిరుద్యోగులు భారీగా తరలివచ్చి తమ బాధలను చెప్పుకొని ఉపశమనం పొందుతున్నారన్నారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరినీ జననేత ఆప్యాయంగా పలకరించి, వారి యోగక్షేమాలను ఎంతో ఓపికతో అడిగి తెలుసుకుంటున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తారన్నారు. పాదయాత్ర జిల్లాలో వచ్చే నెల 4 వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.

రైతులకు పెద్ద పీట వేస్తాం
వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులకు పెద్ద పీట వేస్తామని పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్‌రెడ్డి అన్నారు. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, నవరత్నాల్లో రైతు భరోసాలో పెట్టుబడి నిధి కింద ఏడాదికి రూ.12,500 ప్రకారం నాలుగేళ్లపాటు ఉచితంగా ఇవ్వడంతోపాటు పంటల పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి రైతులకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయా«భివృద్ధికి తీసుకోనున్న సంక్షేమ పథకాలపై అన్నదాతలకు అవగాహన కోసం పాదయాత్ర రూట్లలో వాల్‌ పోస్టర్లను అతికించనున్నట్లు చెప్పారు. సమావేశంలో రైతు విభాగం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివరామిరెడ్డి, భాస్కరరెడ్డి, నాయకులు కర్నాటి పుల్లారెడ్డి, కరుణాకరరెడ్డి, నాగేంద్ర పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు