కానుక..నాసిరకం

8 Jan, 2016 00:17 IST|Sakshi

అమలాపురం :‘మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్టవిప్పి చూడ పురుగులుండు’ అన్న చందంగా ఉన్నాయి చంద్రన్న పండగ కానుకలు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఇస్తున్న పండగ కానుకల్లో నాణ్యత లోపిస్తోంది. క్రిస్మస్, సంక్రాంతి పండగలకు పంపిణీ చేసిన చంద్రన్న కానుకల్లో పప్పులు పుచ్చిపోగా, బెల్లం జావగారి పోతోంది. పండుగ నాడు పిండివంటలు చేసుకోవాలని కానుకను అందుకునేందుకు వెళుతున్న పేదలు సరుకులను చూసి నీరుగారిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ ఆరంభమైంది. ఇప్పటికే క్రిస్మస్ పండగ నాడు కొంతమందికి వీటిని అందించారు. బియ్యం, పంచదార, కిరోసిన్‌లతోపాటు కందిపప్పు, శనగపప్పు అరకేజీ చొప్పున, నెయ్యి 100 గ్రాములు, గోధుమ పిండి కేజీ, బెల్లం, పామాయిల్ అరకేజీ చొప్పున పంపిణీ చేస్తున్నారు. పేదల ఇంట పండగ పిండివంటలు చేసేందుకు వీటిని ఉచితంగా అందజేస్తున్నారు. అయితే సరుకుల నాణ్యత అంతంత మాత్రంగానే ఉంది.
 
 కందిపప్పు, శనగపప్పు తక్కువ రకంవి ఇస్తున్నారు. వీటిలో పుచ్చులు, నలిగిపోయిన పప్పు బద్దలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక బెల్లం గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జావగారి ముద్దలా ఉంటోంది. కొన్నిచోట్ల బెల్లం పాకంలా మారి ప్యాకెట్ల నుంచి కారిపోవడం చూసి డీలర్లే గగ్గోలు పెడుతున్నారు. కొన్ని దుకాణాలకు నెయ్యి ఇంకా చేరలేదు. సరుకులు చేరకపోవడం వల్ల పంపిణీ ఆలస్యమవుతోందని, ఈ సమయంలో బెల్లం పాకంలా మారిపోవడం తమకు సమస్యగా మారుతోందని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. వీటి పంపిణీ జిల్లాలో గురువారం నుంచి అధికారికంగా ఆరంభించారు. చాలాచోట్ల అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఈ పంపిణీని ప్రారంభించారు. అయితే ఈ-పాస్ సర్వర్ పనిచేయకపోవడంతో సరుకుల పంపిణీ అంతంత మాత్రంగానే సాగింది. సర్వర్‌ను మార్చాలని గతం నుంచీ డిమాండ్ వినిపిస్తున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారు. దీనితో పండగ నాటికి అందరికీ కానుకల పంపిణీ జరుగుతుందనే నమ్మకం లేకుండా పోయింది.
 
 ఇదీ కానుక సరుకుల స్థితి..
 మండపేట నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా సుమారు 20 వేల మంది కార్డుదారులకు  చంద్రన్న క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. బెల్లం, శనగలు నాసిరకంగా ఉన్నాయని కార్డుదారులు విమర్శించారు. సంక్రాంతి కానుకలకు సంబంధించి దుకాణాలకు నెయ్యి సరఫరా ఇంకా జరగలేదు. ఇప్పటికే షాపుల్లోకి చేరిన బెల్లం నీరుగారుతోంది. పండుగ సమీపిస్తున్నా సరుకులు ఇంకా పంపిణీ కావడంలేదని కార్డుదారులు విమర్శిస్తున్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో సరుకులు బాగానే ఉన్నా తూకాల్లో తేడాలు ఉన్నట్టు రేషన్‌కార్డుదారులు చెబుతున్నారు. డబ్బాలో ఇస్తున్న  తక్కువగా ఉంటోంది. కందిపప్పు నాసిరకంగా ఉంది. బెల్లం కూడా నాణ్యమైనది కాదు.ప్రత్తిపాడు నియోజకవర్గంలో వారం క్రితం చంద్రన్న కానుక సరుకులు రేషన్‌డిపోలకు చేరాయి. చంద్రన్న సంచులు రాకపోవడంతో ఆన్‌లైన్ సైట్ ఓపెన్ కాలేదు. సరుకులు కూడా పూర్తిస్థాయిలో రాలేదు. ఆలస్యం కావడంతో బెల్లం పాకంగా మారుతోంది. ముమ్మిడివరంలో సరుకులు ఇంకా పంపిణీ కాలేదు. అమలాపురంలో నాసిరకం పప్పు డీలర్లకు చేరింది. మామిడికుదురులో బెల్లం జావగారి పాకంలా మారింది. రాజమండ్రి రూరల్‌లో పలుచోట బెల్లం తూకంలో 25 గ్రా ముల నుంచి 50 గ్రాముల తేడా వస్తోంది. రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనులు సరుకుల కోసం తరలివస్తూ, ఇంకా ఇవ్వడం లేదని తెలిసి నిట్టూర్చి వెనుదిరుగుతున్నారు.
 

మరిన్ని వార్తలు