చంద్రన్నా.. మా మొర ఆలకించన్నా..

8 Jan, 2016 00:40 IST|Sakshi

 నల్లజర్ల రూరల్ : ‘మేమంతా అర ఎకరం.. ఎకరం.. రెండు ఎకరాలు సాగు చేసుకుంటున్న దళిత, బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలం. దశాబ్దాలుగా పోడు భూములను వ్యవసాయూనికి అనుగుణంగా బాగు చేసుకుని వాటిని సాగు చేసుకుని జీవిస్తున్నాం. ఇప్పుడిప్పుడే మా కష్టానికి తగిన ఫలాలు అందుకోబోతున్నాం. ఈ లోగా పరిశ్రమల స్థాపన అంటూ తరతరాలుగా మేం సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను లాక్కొని మా నోటి దగ్గర ముద్దను దూరం చేసేందుకు మీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చంద్రన్నా.. నీవన్నా మా మొర ఆలకించి ఆ భూములను లాక్కోవద్దనా’.. అంటూ నల్లజర్ల మండలంలోని రైతులు వాపోతున్నారు.  
 
 నల్లజర్ల మండలం దూబచర్లలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్క్‌కు 586.25 ఎకరాల భూమిని తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిపై రైతులు మూకుమ్మడిగా ఆరు నెలలుగా నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. మరోపక్క కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ భూముల్లో 58.25 ఎకరాలు జిరాయితీ భూమి కాగా 18 ఎకరాలు ప్రభుత్వం పోరంబోకు,510 ఎకరాలు అసైన్డ్ భూమి ఉంది. తాతలు, దండ్రుల నాటి నుంచి పోడు భూమిని అభివృద్ధి చేసి చదును చేసి వారు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్లో నిమ్మ, ఆయిల్‌పామ్, జీడిమామిడి, సీతాఫలం వంటి పంటలతో పాటు సంవత్సరానికి మూడు పంటలు పండే విధంగా బోర్లు వేశారు. వాటి ఫలాలు ఇప్పుడిప్పుడే వారికి చేతికి అందబోతున్నాయి. ఇటువంటి తరుణంలో ఈ భూములను పరిశ్రమలకు కేటాయించాలంటూ ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
 
 నేడు సీఎం దృష్టికి సమస్య
 ప్రభుత్వం నిర్ణయం కనుక అమలు జరిగితే దాదాపు దళిత, బీసీ వర్గాలకు చెందిన 500 కుటుంబాలు వీధిన పడనున్నాయి. భూములు పోతే ప్రత్నామ్నాయం లేక వలసలు పోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జన్మభూమి-మా ఊరు సభలో పాల్గొనేందుకు శుక్రవారం నల్లజర్ల వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లనున్నట్టు రైతులు నందమూరి సుబ్రహ్మణ్యం, తాడిగడప శ్రీనివాసరావు, కారెం రాంబాబు, కారెం అచ్చియ్య, బోడిగడ్ల వెంకట సుబ్బారావు, సుసేశ్వరావు, పొంగులేటి అబద్ధం, తోట సుబ్బారావు తదితరులు తెలిపారు. తమ మొరను ముఖ్యమంత్రి ఆలకించకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారంతా వాపోతున్నారు.
 
 పేదల భూములే కావాలా ?
 పరిశ్రమలు పెట్టడానికి పేదల భూములే కావాలా? చాలా మంది పెద్ద రైతుల వద్ద భూములున్నాయి. 80 ఏళ్లుగా పోడు భూములను సాగు చేసుకుని అభివృద్ధి చేస్తే ఆ భూముల్ని మా దగ్గర లాక్కొని బడా పారిశ్రామిక వేత్తలకు ధారదత్తం చేయూలని చూడడం దారుణం.
 - కారెం రాంబాబు, రైతు, ముసుళ్ళగుంట
 
 పురోగమనమా? తిరోగమనమా?
 చంద్రబాబు గారి ప్రభుత్వం అభివృద్ధి పురోగమనమా? తిరోగమనమో అర్థం కావడం లేదు. పోడుభూముల్ని అభివృద్ధి చేసి ఇప్పుడిప్పుడే సుస్థిర పడుతున్నాం. ఇప్పుడు భూముల్ని లాక్కుంటే మేం ఎక్కడికి పోవాలి? మా పిల్లల బతుకులు ఏం కావాలి. రోడ్డున పడితే ఆయనకి సంతోషమా?
 - శొంఠి వరలక్ష్మి, రైతు, దూబచర్ల
 

మరిన్ని వార్తలు