వ్యాపారి దారుణ హత్య

1 Oct, 2013 02:09 IST|Sakshi

విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : గవర్నర్‌పేటలో ఫ్లైవుడ్ షాపు నిర్వహించే వ్యాపారి నాలం రామ్మోహనరావు (52)ను  గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సూర్యారావుపేటలో తాను నివాసముండే భవనంలోనే హతమార్చి  శవాన్ని పొరుగింటి వెనుక ఖాళీ ప్రదేశంలో పడవేశారు. సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్యకు గురైన రామ్మోహనరావు  సూర్యారావుపేటలోని పూసపాటి వారి వీధిలో నివసిస్తున్నారు.  

శనివారం రాత్రి షాపు నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి, తన పొరుగింటి పెరట్లో శవమై తేలారు. హతుడి  ముఖం కనపడకుండా పార్శిల్ టేప్ దట్టంగా చుట్టి ఉంది. ఆదివారం రాత్రి 10-30 గంటల సమయంలో తమ కాంపౌండ్‌లో ఏదో కిందపడిన శబ్దం వినపడిందని మృతదేహం పడి ఉన్న రెండంతస్తుల భవనంలో నివసించే వారు చెబుతున్నారు.

భవనంపై టాప్‌ఫ్లోర్‌లో గెస్ట్ రూమ్ వద్ద నెత్తుటి మరకలు ఉండడం, హతుడి ముఖంపై వేసిఉన్న పేపర్ టేప్ ముక్కలు, చిన్నచిన్న తాళ్లు దొరకడంతో రామ్మోహనరావును అక్కడే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. టాప్‌ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్‌ల వద్ద నెత్తుటి మరకలు కడిగిన ఆనవాళ్లు కూడా  గుర్తించారు. టాప్‌ఫ్లోర్ నుంచి మృతదేహాన్ని  పడేశారా, లేదా దాన్ని ఎక్కడికైనా తరలించే ప్రయత్నంలో జారి పడిపోయింద అనే విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది. హతుడి ఒంటిపై షర్టు, డ్రాయర్ మాత్రమే ఉన్నాయి. దేహానికి పరజా సంచి చుట్టి ఉంది. రామ్మోహనరావును ఊపిరాడకుండా చేసి హతమార్చినట్లు  పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
 
హోమోసెక్స్ కారణమా?

 రామోహ్మహ నరావుకు హోమోసెక్స్ అలవాటు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలిసింది. తన ఇంటి సెకండ్ ఫ్లోర్‌లో అద్దెకు ఉంటున్న ఓ యువకుడి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, హతుడు తనతో హోమోసెక్స్‌లో పాల్గొనేవాడని చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రమే రామ్మోహనరావును ఆ యవకుడు  హత్యచేసినట్లు సమాచారం. రామ్మోహనరావు ఒంటిపై ఉన్న బంగారం గొలుసును కూడా పోలీసులు అతడి నుంచి  స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
 

మరిన్ని వార్తలు