జగన్‌ను విమర్శిస్తే ప్రజలే బుద్ధిచెబుతారు

12 Jun, 2014 04:41 IST|Sakshi
జగన్‌ను విమర్శిస్తే ప్రజలే బుద్ధిచెబుతారు

విశాఖపట్నం : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద దాడి వీరభద్రరావు చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ నేతలు ఖండించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, పార్టీ అనకాపల్లి లోక్‌సభ స్థానం నాయకుడు గుడివాడ అమర్‌నాథ్ బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబునాయుడు కాళ్లు పట్టుకుని ఆ పార్టీలోకి వెళ్లేందుకే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి వీరభద్రరావు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే సర్వేశ్వరరావు పేర్కొన్నారు. ఇంత దుర్మార్గమైన పెద్ద మనిషికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారా రాజకీయ లబ్ధిపొందాలని దాడి వీరభద్రరావు వైఎస్సార్ సీపీలో చేరారని పేర్కొన్నారు.

చివరకు ఆయన తన కొడుకును గెలిపించుకోలేక తిరిగి జగన్‌పై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. జగన్ లాంటి నేతను విమర్శిస్తే దాడికి పుట్టగతులుండవన్నారు. ఇదే దాడి రాష్ట్రానికి జగన్ ద్వారానే మేలు జరుగుతుందని అనేకసార్లు చెప్పారని గుర్తుచేశారు. తిరిగి మళ్లీ ఆయన జగన్‌ను విమర్శిస్తున్నారన్నారు. ఇదేం పద్ధతని ప్రశ్నించారు. అసలు దాడికి కనీస నైతిక విలువలు లేవని చెప్పారు. ఆయనది తిన్నింటి వాసాలు లెక్కించే నైజమని పేర్కొన్నారు. పార్టీ నాయకుడు గుడివాడ్ అమర్‌నాథ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఓటమికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కారణం కాదని, దీనికి ఎన్నో కారణాలున్నాయని చెప్పారు.

ఒకపక్క మూడు పార్టీల కూటమి, మరోపక్క ఎల్లోమీడియా.. ఇలా అందరూ ఒకవైపు.. జగన్ ఓవైపు ఉన్నారన్నారు. అయినా రికార్డుస్థాయి ఓట్లు పడ్డాయని గుర్తుచేశారు. దాడి జగన్‌పై ఎన్నికలకు ముందుకాకుండా ఇప్పుడే ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని పార్టీలో చేరిన దాడి.. తీరా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో స్వార్థప్రయోజనంతో బురద జల్లుతున్నారని విమర్శించారు. జగన్ పార్టీకి రానురాను గ్రాఫ్ పెరుగుతోందన్నారు. కొత్తగా పుట్టి అసెంబ్లీ ఎన్నికల్లో దిగిన పార్టీ రికార్డు స్థాయిలో ఓట్లు సాధించడం బహుశా ఎక్కడాలేదని చెప్పారు. కానీ దాడి ఏదో ప్రయోజనంతోనే దుర్బుద్ధితో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు