జనం సొమ్ముతో జాతర

30 Dec, 2015 23:32 IST|Sakshi
జనం సొమ్ముతో జాతర

రేపటి నుంచి విశాఖ ఉత్సవ్
రూ.కోటి ప్రకటించినా పైసా విదల్చని సర్కార్
ముందుకు రాని దాతలు.. బలవంతంగా వసూళ్లు

 
విశాఖపట్నం: సొమ్మొకడిది.. సోకొకడది..అన్నట్టుగా ఉంది సర్కార్ తీరు. విశాఖ ఉత్సవాలకు సర్కార్ రూ.కోటి ప్రకటించినా నేటికీ ఒక్క పైసా విడుదల కాలేదు. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఉత్సవాలకు చేయూతనిచ్చేందుకు పారిశ్రామిక సంస్థలు, దాతల నుంచి కూడా ఆశించిన స్థాయిలో సహకారం  లభించలేదు. అయినా సరే జనం సొమ్ముతో జాతర చేసేందుకు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది.

అన్నీ అనుచరగణానికే
నూతన సంవత్సరం తొలిరోజైన జనవరి ఒకటో తేదీన విశాఖ సాగరతీరంలో శ్రీకారం చుట్టుకోనున్న ఈ ఉత్సవాలు మూడురోజుల పాటు జరగనున్నాయి. రాష్ర్ట ఉత్సవాలుగా నిర్వహిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన సర్కార్ రూ.కోటి మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. కానీ ఉత్సవాల ప్రారంభానికి మరో 48 గంటలలే మిగిలి ఉన్నప్పటికీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. మరోపక్క గత ఏడాదితో పోలిస్తే దాతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదు. అన్నీ అరువు బేరాలే అన్నట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పారదర్శకత పేరుతో టెండర్ల నాటకమాడినా చివరకు ఈవెంట్స్, పనులన్నీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరగణం దక్కించుకున్నారు.  
సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఐఐఎం శంకుస్థాపనకు అయిన ఖర్చు అరకోటి. స్వాతంత్య్ర వేడుకలకు అయిన ఖర్చు రూ.అర కోటి. ఏడాది తర్వాత ఐఐఎం శంకు స్థాపన సొమ్ములు అరకొరగా విడుదలైనా.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుక ల నిధులు నేటికీ విడుదల కాలేదు. గత ఏడాది అట్టహాసంగా జరిగిన విశాఖ ఉత్సవాల్లో ప్రదర్శనలిచ్చిన కళాకారులకు నేటికీ చెల్లింపులు జరగలేదు. రూ.30 లక్షలకుపైగా చెల్లింపులు జరగాల్సి ఉంది. పాత బకాయిలకే దిక్కులేని పరిస్థితుల్లో ఈసారి ఉత్సవాలకు ఏకంగా మూడున్నర కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. సర్కార్ కోటి ప్రకటించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్న అధికారులు మిగిలిన రెండున్నర కోట్లు దాతల నుంచి కూడగట్టాలని ప్రణాళికలు రచించారు. ఈ వంకతో మరో రూ.కోటికి పైగా దండుకోవాలని అధికార పార్టీ నేతలు రంగం సిద్ధం చేశారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వుడా, జీవీఎంసీలపై భారం మోపారు. ఉత్సవాల నిర్వహణ  బాధ్యతలను కూడా వుడాకే అప్పగించడంతో కొంత మేర ఆర్ధిక భారం మోసేందుకు వుడా సిద్ధమైంది. మరో పక్క ఆర్ధిక లోటుతో సతమతవుతున్న జీవీఎంసీ మాత్రం నిధులిచ్చేందుకు ముందుకు రావడం లేదు.

కావాలంటే తమ సిబ్బంది ద్వారా పనులు చేయిస్తాం తప్ప నిధులు సమకూర్చలేమని జీవీఎంసీ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ విలేకర్ల సమావేశంలోనే స్పష్టం చేశారు. హుద్‌హుద్ తో తీవ్రంగా నష్టపోయిన పారిశ్రామిక సంస్థల నుంచి గత ఏడాది ముక్కుపిండి మరీ విరాళాలు వసూలు చేశారు. ఈ ఏడాది ఆ స్థాయిలో వీరి నుంచి సహకారం లభించడం లేదని ఉత్సవాల నిర్వహణ  కమిటీలో ఉన్న కీలకాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. దీనికి తోడు గడిచిన ఏడాదిలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు సంబంధించి బకాయిలు రూ.1.50 కోట్ల వరకు పేరుకుపోవడంతో ఉత్సవాల్లో పాలు పంచుకునేందుకు గతంలో ఉత్సాహం చూపిన సంస్థలు ఈసారి అంతగా ఆసక్తి చూపడం లేదని తెలిసింది. మరోపక్క మంత్రి పంపించారు.. ఉత్సవాలకు ఇవ్వాల్సిందేనంటూ కొంతమంది అధికారులు పారిశ్రామిక సంస్థల నుంచి బలవంతంగా వసూలు చేసినట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. అధికారికంగా ఇప్పటికే రెండు కోట్లకు పైగా దండినట్టు తెలుస్తోంది. జనం సొమ్ముతో మరోసారి జాతర చేసేందుకు అధికార యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది.
 

మరిన్ని వార్తలు