వామ్మో ‘నిపా’

26 May, 2018 11:38 IST|Sakshi
సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లో వేపచెట్టు నిండా గబ్బిలాలు

నెల్లూరు(బారకాసు):  ‘నిపా‘ వైరస్‌ ఇప్పుడు అందర్నీ వణికిస్తోంది. కేరళలో ఈ వైరస్‌ సోకి 11 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి వ్యాధి సోకిందనే వార్తలతో ప్రజల్లో తీవ్ర కలకలం రేగుతోంది. దీనిపై ఇప్పటికే కేంద్రం స్పందించి హై అలర్ట్‌ జారీ చేసింది. జిల్లాలో కేరళకు చెందిన వారు చాలా మంది స్థిరపడ్డారు. వీరు తరచూ సొంత రాష్ట్రానికి రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే వీరి బంధువులు సైతం జిల్లాకు వచ్చి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది.

అప్రమత్తత అవసరం
అప్రమత్తంగా లేకపోతే నిపా వైరస్‌ జిల్లాకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కేరళకు చెందిన వారు పెద్ద ఎత్తున జిల్లాలో వివిధ వ్యాపారాల రీత్యా స్థిరపడ్డారు. వీరంతా వారి సొంత రాష్ట్రమైన కేరళకు రాకపోకలు సాగిస్తున్నారు. అంతేకాకుండా అక్కడి నుంచి వారి బంధువులు కూడా ఇక్కడికి వస్తూ పోతుంటారు. కేరళ, త్రివేండ్రం, కొచ్చిన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నెల్లూరు మీదుగానే ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో రైళ్లల్లో ప్రయాణం చేసే వారిలో ఎవరికైనా ఈ వైరస్‌ సోకి ఉంటే ఆ వ్యక్తి నుంచి ఇతరులకు సోకే ప్రమాదం ఉందని పలువురు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్ల సమీపంలోని చెట్లలో పెద్ద ఎత్తున గబ్బిలాలు దర్శనమిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

నిపా సోకేది ఇలా..
నిపా వైరస్‌ గబ్బిలాలు,పందుల ద్వారా సోకుతుంది. గబ్బిలాలు కొరికిన పండ్లను తిన్నా, దాన్ని తాకినా వైరస్‌ సోకుతుంది. అలాగే గబ్బిలాలు పందులను పొడిచి గాయపరిచినప్పుడు వాటి నుంచి పందులకు సోకుతుంది. గాయపడిన పందులు జనసంచారంలో తిరగడం ద్వారా ఈ వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తి తుమ్మినా..దగ్గినా వచ్చే తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

లక్షణాలు ఇలా..
నిపా వైరస్‌ సోకిన వ్యక్తి శ్వాసతీసుకోవడంలో అవస్థ పడతారు.
భరించలేనంతగా తలనొప్పి, తీవ్ర జ్వరం.
ఎండలో తిరిగినప్పుడు మాడు ఎలా మండిపోతుందో అలాంటి ఫీలింగ్‌ ఉంటుంది.
మెదడు కూడా మండిపోతున్నట్లు ఉం టుంది.
ఉన్నట్లుండి కుప్పకూలిపోతారు.
రోజుల తరబడి మత్తునిద్రలో ఉంటారు.
ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరు.
మందులు వేసుకున్నా వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు ముదిరితే రెండురోజులకే కోమాలోకి వెళ్లిపోయి ప్రాణా పాయం సంభవించే అవకాశం ఉంది. 

అప్రమత్తంగా ఉండాలి
నిపా వైరస్‌  సోకితే చికిత్స లేదు. లక్షణాలను బట్టి ప్రాథమిక దశలో గుర్తిస్తే అందుకు అవసరమైన వైద్యసేవలందించే అవకాశం ఉంది. నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేకంగా వార్డును కేటాయిస్తాం. లక్షణాలు గుర్తించి అవసరమైతే ప్రత్యేక వైద్యం అందిస్తాం. ప్రజలను చైతన్యం చేసేందుకు వివిధ రకాల ప్రచారాలు చేపడతాం. ఈ విషయమై ఈ నెల 28న మా శాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. 

మరిన్ని వార్తలు