సీఎం గారూ.. అమృతం వద్దు..మంచినీళ్లు ఇవ్వండి

17 Sep, 2014 03:54 IST|Sakshi
సీఎం గారూ.. అమృతం వద్దు..మంచినీళ్లు ఇవ్వండి

‘‘హైటెక్ సిటీ నిర్మించాను.. ఒక్కమాటలో చెప్పాలంటే హైదరాబాద్‌ను, ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచపటంలో నేనే పెట్టాను !’’ .. పదేపదే చంద్రబాబువల్లెవేసే మాటలు ఇవి.
 
సాక్షి, చిత్తూరు: ‘ఇంటిబాగు పట్టనమ్మకు.. ఊరిబాగు కావాలంట!’ అన్న చందంగా ఉంది చంద్రబాబు తీరు! పాతికేళ్ల పైబడి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు.. జిల్లా ప్రజల ఆశీస్సులతో మరోసారి సీఎం పీఠమెక్కారు. రాష్ట్రచరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కానీ విధంగా 9ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు.
 
కానీ ఏం లాభం సొంత జిల్లాను పట్టిపీడిస్తున్న మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించలేకపోయారు. ప్రతి ఎన్నికల్లోనూ ‘మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం.. ఇది యథార్థం!’ అని మాటలతోనే ఊరించి తీరా గద్దెనెక్కాక ఉసూరుమనిపిస్తున్నారు. గొంతెమ్మకోరికలు కాకుండా మంచినీటి సమస్యను మాత్రం తీర్చండి చాలు అని ప్రతి ఎన్నికల్లో మొరపెట్టుకునే జిల్లావాసులు, ఆ ఒక్క సమస్య నుంచి మూడు దశాబ్దాలుగా బయటపడలేకపోతున్నారు. కాదు.. కాదు.. పాలకులు ఆదిశగా చర్యలకు ఉపక్రమించడంలేదు.
 
ప్రజల్ని మోసం చేసింది పాలకులే!
చిత్తూరు జిల్లాను మూడు దశాబ్దాలుగా మంచినీటి సమస్య పట్టిపీడిస్తోంది. చిత్తూరు కార్పొరేషన్, మదనపల్లె, నగరి మునిసిపాలిటీలతోపాటు 1202 గ్రామాల ప్రజలను మంచి నీటి సమస్య వేధిస్తోంది. ఇందులో 1043 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మరో 159 గ్రామాల ప్రజలు వ్యవసాయబోర్లను ఆశ్రయిస్తున్నారు. అలాగే చిత్తూరు మునిసిపాలిటీలో 120 ట్యాంకర్ల ద్వారా రోజూ మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మదనపల్లెలో 29ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.
 
వీటితో పాటుతిరుపతి మినహా దాదాపు ప్రతీ మునిసిపాలిటీలోనూ మంచినీటి సమస్య వేధిస్తోంది. ప్రైవేటుగా వందల ట్యాంకర్లు నీటిని సరఫరా చేస్తున్నాయి. బిందెనీటిని 2-3 రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో మంచినీటి సరఫరా కోసం ఏటా ప్రభుత్వం 21.45 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే, ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు ప్రతి నెలా లక్షల రూపాయలు అర్జిస్తున్నారు. మదనపల్లెలో ప్రతినెలా 2.13 కోట్ల మంచినీటి వ్యాపారం జరుగుతుందంటే సమస్య తీవ్రత ఇట్టే తెలుస్తోంది. అలాగే చిత్తూరు కార్పొరేషన్‌లో ఇప్పటికీ మెజార్టీ వీధుల్లో మంచినీటి ప్రజలకు మంచినీటి కొళాయి ద్వారా నీరు అందడం లేదు. కార్పొరేషన్ ట్యాంకర్లు వస్తే పట్టుకుంటున్నారు. లేదంటే ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు. డబ్బులు వెచ్చించినా దక్కేది ఉప్పునీరే!
 
ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గుర్తించినవి ఇవే..
పూతలపట్టు, తంబళ్లపల్లె, కుప్పం, చంద్రగిరి, సత్యవేడు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాల్లో తీవ్ర మంచినీటి సమస్య ఉన్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు గుర్తించారు. ఇవి కాకుండా అన్ని మునిసిపాలిటీల్లోనూ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమస్య గత 30 ఏళ్లుగా ఆయా ప్రాంతాలను పట్టిపీడిస్తోంది. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి ‘అయ్యా! మా దప్పిక తీర్చండి చాలు.. మి మ్మల్ని మరేకోరిక అడగం’ అని ఓటర్లు ప్రజాప్రతినిధులకు రెండుచేతులెత్తి మొక్కుతూనే ఉన్నారు. సమస్య పరిష్కారస్తారని ఆశతో ఓట్లేసి అందలం ఎక్కిస్తున్నారు. ప్రజలంతా నాయకుల్ని నమ్మి గెలిపిస్తే.. వారు మాత్రం 3దశాబ్దాలుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు.
 
9 ఏళ్లలో ఏం చేశావు బాబు ?
9 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు చిత్తూరుతో పాటు జిల్లాలో మంచినీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారించలేదు. సొంతజిల్లా వాసుల దప్పిక తీర్చలేని ఈయన రాష్ట్రాన్నే ప్రపంచపటంలో పెట్టానని ప్రగల్భాలు చెబుతుంటారు. కానీ జిల్లా ప్రజలకు చేసేందేమీ లేదు. ఓట్ల పేరుతో మోసం చేయడం తప్ప! ఈయన వెంట ఉన్న నాయకులు కూడా మంచినీటి సమస్యను ఆదాయవనరుగా మార్చుకుని ట్యాంకర్ల సరఫరా పేరుతో నిధులు మింగుతున్నారే గానీ, సమస్య పరిష్కారానికి పాటుపడటం లేదు. ఈయనతో పాటు కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా మూడేళ్లపైబడి సీఎంగా పాలన సాగించారు.
 
ఈయన కూడా గద్దెదిగే ముందు 7,430 కోట్ల రూపాయలతో కండలేరు మంచినీటి పథకాన్ని సిద్ధం చేశారు. 5,900 కోట్లతో టెండర్లు పిలిచారు. 150 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. కిరణ్ సీఎంగా తొలినాళ్లలోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే నీళ్లు వచ్చేవే! కానీ చివర్లో ప్రకటించి ఆ పథకాన్ని నీటిపాలు చేశారు. ఈయన హాయంలోనే మంచినీళ్లు ప్రజల గుప్పిటకు చేరలేదు. కనీసం ఈదఫా అయిన చంద్రబాబు మంచినీళ్లు అందిస్తారేమోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి చంద్రబాబు జిల్లా ప్రజల దప్పిక తీరుస్తారా? లేదంటే ఎప్పటిలాగే తనదైన శైలిలో చేయిస్తారా? అనేది వేచి చూడాల్సిందే!!

మరిన్ని వార్తలు