వరద వదిలింది.. బురద మిగిలింది

12 Sep, 2014 00:50 IST|Sakshi
వరద వదిలింది.. బురద మిగిలింది

కొవ్వూరు/పోలవరం : గోదావరిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ప్రమాద హెచ్చరికలను గురువారం ఉపసంహరించారు. గోష్పాద క్షేత్రంలోని ఆలయాలు వరద ముంపు నుంచి తేరుకున్నాయి. శ్రీబాలా త్రిపురసుందరి సమేత సుందరేశ్వరస్వామి ఆలయం, గీతా మందిరం, షిర్డీసాయి ఆలయంలో ఒండ్రు మట్టి, ఇసుక మేటలు వేశారుు. మూడు రోజులపాటు ఆలయాలు ముంపులోనే ఉండటంతో ధూపదీప నైవేద్యాలు నిలిచిపోయాయి. ఆలయాల్లో పేరుకుపోయిన బురదను గురువారం ఉదయం తొలగించి, శుభ్రం చేసే పనులు చేపట్టారు.
 
గోష్పాద క్షేత్రంలోకి వెళ్లే రహదారులు బురదమయంగా మారాయి. పలుచోట్ల ఇసుక, ఒండ్రు మేటలు వేశారుు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం తగ్గడంతో బుధవారం రాత్రి 11 గంటలకు రెండో ప్రమాద హెచ్చరికను, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సాయంత్రం 4 గంటలకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 10.40 అడుగులు నమోదైంది. గోదావరి నుంచి 8,49,625 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. ఆనకట్టకు గల 175 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు తగ్గడంతో లంక భూములు ముంపు బారినుంచి తేరుకుంటున్నాయి.
 
జల దిగ్బంధంలోనే గిరిజన గ్రామాలు
పోలవరం/పోలవరం రూరల్ : గోదావరి శాంతించినా ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిపై పలుచోట్ల వరద నీరు ఇంకా తొలగిపోలేదు. గిరిజనులు గ్రామాలను విడిచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో ఇంకా సుమారు ఐదు అడుగుల నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. మామిడిగొంది, దేవరగొంది, చేగొండపల్లి గిరిజనులు మాత్రం కొండల పైనుంచి అంచెలంచెలుగా పోలవరం చేరుకుని నిత్యావసర సరుకులు, అవసరమైన మందులు కొనుగోలు చేసి తీసుకువెళుతున్నారు.
 
స్పిల్‌వే ప్రాంతంలో విద్యుత్ స్తంభం విరిగి పోవడంతో ఏజెన్సీ గ్రామాలకు సింగల్ ఫేజ్ విద్యుత్ మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో ఏజెన్సీ గ్రామాల్లో మంచినీటి పథకాలు పనిచేయడం లేదు. మంచినీటి కోసం గిరి జనులు ఇబ్బందులు పడుతున్నారు. కోండ్రుకోట, మాదాపురం గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేదు. కొత్తూరు కాజ్‌వే మీదుగా ఇంకా వరద నీరు ప్రవహిస్తోంది. కొన్నిచోట్ల రోడ్లు బయటపడినా బురద పేరుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

మరిన్ని వార్తలు