నిండా ముంచిన ‘మైత్రి ప్లాంటేషన్’

8 Dec, 2013 05:21 IST|Sakshi

 సుల్తానాబాద్, న్యూస్‌లైన్ : ‘మైత్రి ప్లాంటేషన్’ పేరిట భారీ మోసానికి పాల్పడిన సంఘటన మండలంలోని కాట్నపల్లిలో శనివారం వెలుగుచూసింది. సుమారు 28 మంది నుంచి రూ.20లక్షలకు పైగా దినసరి.. ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో వసూలు చేసి చేతులెత్తేశారు. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సీత సంపత్ తాను ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన మాధవరెడ్డి స్థాపించిన మైత్రి ప్లాంటేషన్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌ లో ఏజెంట్‌గా పనిచేస్తున్నానని, ఆయన ఖమ్మ జిల్లా ఏరుపాలెం మండలం రాజుపాలెం గ్రామంలోని సర్వేనంబర్ 81లో భూములు కొనుగోలు చేశాడని, పాలసీ చేస్తే రెండున్నరేళ్ల అనంతరం ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు ప్లాంటేష న్ ద్వారా వచ్చిన లాభాలు పంచుతామని నమ్మించాడు.

సంస్థ మోసం చేస్తే తన పొలాన్ని విక్రయించి డబ్బు తిరిగి ఇస్తానని పేర్కొనడంతో నమ్మామని బాధితులు ఆడెపు లక్ష్మీనారాయణ, కోడూరి విజయ, అంజయ్య, శంకరయ్య, పూసాల తిరుపతి, వెంకటేశం, శారద, రాజయ్య, సంపత్, రంగయ్య తెలిపారు. ఇలా 28మంది నుంచి రూ.20లక్షలు వసూలు చేశాడు. చెప్పిన సమయం దాటిపోవడంతో భూములు రిజిస్ట్రేషన్ చేయాలని గ్రామస్తులు సంపత్‌పై ఒత్తిడి తెచ్చారు. చేతులెత్తేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సంప త్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వసూలు చేసిన డబ్బును సంస్థకే చెల్లించానని, సంస్థ నుంచి రాగానే ఇస్తాన ని సంపత్ మొండికేశాడు.

బాధితులు అతడిని పంచాయతీ కార్యాలయానికి పిలిపించారు. సంస్థలకు సంబంధించిన ఎలాంటి గుర్తింపు కాగితాలు సంపత్ వద్ద లేకపోవడంతో బాధితులకు డబ్బులు ఇవ్వాల్సిందేనని వార్డు సభ్యులు మోరపల్లి తిరుపతిరెడ్డి, కొల్లూరి శంకరయ్య, మాజీ ఎంపీపీ పాలరామారావు సూచించారు. అయినా సంపత్ వినిపించుకోకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు సంపత్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.

మరిన్ని వార్తలు