భూముల స్వాహాపై ప్రజాగ్రహం

29 May, 2016 01:37 IST|Sakshi

తీవ్ర కలకలం సృష్టించిన ‘సాక్షి’ కథనం
 
 సాక్షి, విజయవాడ: సదావర్తి సత్రం భూముల దోపిడీపై రాష్ట్ర ప్రజానీకం భగ్గుమన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సత్రం ఆస్తులను కొల్లగొట్టడం దారుణమని టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రూ.1,000 కోట్ల విలువైన భూములను వేలంపాట పేరిట రూ.22.44 కోట్లకే కాజేయడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ‘అమరావతి సదావర్తి సత్రంలో వెయ్యి కోట్లు లూటీ’ శీర్షికతో శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కలకలం సృష్టించింది. టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ పక్కా స్కెచ్‌తో సాగించిన అడ్డగోలు భూదోపిడీపై వివిధ రాజకీయ పక్షాలు, ధార్మిక సంస్థలు, బ్రాహ్మణ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరోవైపు ప్రభుత్వం ఉలిక్కిపడింది.

ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. దీనిపై  రహస్యంగా విచారణ జరుపుతున్నారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి వారసుడు, సదావర్తి సత్రం చైర్మన్ రాజా వాసిరెడ్డి సుధాస్వరూప్ ‘సాక్షి’ కథనంపై స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దాతలు మంచి ఉద్దేశంతో ఇచ్చిన దేవస్థానం భూములను స్వాహా చేయడం దారుణమనీ, ఇది హిందూ మతానికి ద్రోహం చేయడమేననీ అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య ముఖ్య సలహాదరాఉ కోటా శంకర శర్మ అన్నారు. సదావర్తి సత్రం భూముల దోపిడీపై విచారణ జరిపించాలని కోరారు. ఆ భూములను అమరావతి దేవస్థానానికి తిరిగి అప్పగించేవరకూ పోరాటం చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు