ఆధార్‌ అవస్థలు

29 Aug, 2018 09:36 IST|Sakshi
నెల్లూరులోని ఓ బ్యాంక్‌లోని ఆధార్‌ కేంద్రం వద్ద కార్డులో మార్పులు చేసుకునేందుకు దరఖాస్తుల కోసం పడిగాపులు కాస్తున్న ప్రజలు

ఆధార్‌ కార్డులో చిరునామాల మార్పు, తప్పులను సరిచేసుకునేందుకు ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఓ వైపు ప్రకటనలు చేస్తున్నప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు. పలు కేంద్రాల వద్ద సర్వర్లు మొరాయిస్తుండటంతో ఆయా కేంద్రాల వద్ద ప్రజలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. చిన్నారుల ఫింగర్‌ ప్రింట్స్, ఫొటోల అప్లోడ్‌ తదితర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

నెల్లూరు(వేదాయపాళెం): గతంలో ఆధార్, మీ సేవ కేంద్రాల వద్ద ఆధార్‌ కార్డులో మార్పులు, సవరణలు చేసేవారు. ఆధార్‌ కేంద్రాల నిర్వహణ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కొంతకాలంగా జిల్లాలోని మీ సేవ కేంద్రాల్లో ఆధార్‌ సేవలను నిలిపివేశారు. జిల్లాలో కేవలం రెండు మీ సేవ కేంద్రాల్లో మాత్రమే ఆధార్‌ సేవలను కొనసాగిస్తున్నారు. ఈ రెండు కేంద్రాలను కూడా జిల్లా కలెక్టర్‌ చొరవతోనే సాగుతున్నాయి. జిల్లాలోని పలు పోస్టాఫీసులు, పలు బ్యాంక్‌లలో ప్రత్యేకంగా ఆధార్‌ సేవా విభాగాలను ఏర్పాటు చేశారు. గతంలో జిల్లా కేంద్రంలోని గాంధీబొమ్మ సమీపంలో సండే మార్కెట్‌ వద్ద, నెల్లూరు తహసీల్దారు కార్యాలయం వద్ద ఆధార్‌ కేంద్రాలు కొనసాగుతుండేవి. సండేమార్కెట్‌ వద్ద ఉన్న కేంద్రాన్ని నిలిపివేశారు. తహసీల్దారు కార్యాలయం వద్ద ఉన్న ఆధార్‌ కేంద్రాన్ని సమీపంలోని ఎస్‌బీఐలోకి మార్పు చేశారు. ప్రస్తుతం ఎంపిక చేసిన బ్యాంక్‌లు, పోస్టాఫీసుల వద్ద మాత్రమే ఆధార్‌ సేవలు అరకొరగా అందుతున్నాయి.  
పడిగాపులు
బ్యాంక్‌లు, పోస్టాఫీసుల వద్ద ఏర్పాటు చేసిన ఆధార్‌ విభాగాల వద్ద సర్వర్‌లు తరచూ మొరాయిస్తుండటంతో  అక్కడకెళ్లేవారు పడిగాపులు కాయాల్సి వస్తోంది.  ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు ఆధార్‌ సేవలను పొందాలనుకునేవారు 40 నుంచి 50 మంది ఒక్కొక్క కేంద్రం వద్ద  బారులు తీరుతున్నారు. అయితే ఒక్కో కేంద్రం వద్ద 15 దరఖాస్తులు మాత్రమే అందజేసి ఆరోజు వాటా అయిపోయిదంటూ మిగిలిన వారిని వెనక్కి పంపుతున్నారు. దీంతో ఆధార్‌ కార్డులో మార్పులు చేయించుకోవాలని వచ్చిన వారు తీవ్ర నిరాశతో వెనుదిరిగి వెళుతున్నారు.

కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు
ఒకే కుటుంబంలో వారికి రెండు, మూడు దరఖాస్తులు కావాల్సిన వారు పనులను వదులుకుని పదే పదే కౌంటర్ల వద్దకు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల వివిధ కులాలకు చెందిన వారికి సబ్సిడీ రుణాలను మంజూరు చేశారు. వీరికి ప్రస్తుతం ఉన్న చిరునామాతో ఆధార్‌ కలిగి ఉండాలి. చాలమందికి గతంలో నివాసం ఉన్న చోటే ఆధార్‌ ఉంది. ప్రస్తుతం చిరునామా ప్రకారం ఆ«ధార్‌లో సవరణ చేసుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. సకాలంలో సవరణలు జరిగితే తప్ప బ్యాంక్‌లలో డాక్యుమెంటేషన్‌ కార్యకలాపాలు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ప్రాజెక్టు వర్క్‌లకు సంబంధించి నగదు, బ్యాంక్‌లలో జమ అయ్యేందుకు అకౌంట్లు ఓపెన్‌ చేసుకునేందుకు ఆధార్‌ ఫింగరింగ్‌ తప్పనిసరిగా మారింది. హైస్కూల్‌  విద్యార్థులకు ఈ సమస్య ఇబ్బంది కలిగిస్తోంది.

చిన్నతనంలో తీసిన ఆధార్‌తో సంబంధం లేకుండా ప్రస్తుత ఫింగరింగ్‌ను నమోదు చేయాలనే నిబంధన విద్యాశాఖలో, బ్యాంకుల్లో నెలకొని ఉంది. ప్రాజెక్టు వర్క్‌లకు సంబంధించి ప్రైవేటు పాఠశాలలో తరగతికి ఇద్దరు చొప్పున ఆ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంపిక చేసి విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపుతారు. ప్రాజెక్టు వర్క్‌ను బట్టి రూ.5 వేలు, రూ.10 వేలు చొప్పున విద్యార్థుల ఖాతాల్లో జమ అవుతాయి. ఈ తంతు కొనసాగాలంటే బ్యాంకులలో అకౌంట్లు ప్రారంభించి ఉండాలి. ఆధార్‌ ఫింగరింగ్‌ ఉంటే తప్ప బ్యాంకు అకౌంట్లు ప్రారంభించడం వీలుకాదని బ్యాంకర్లు తేల్చి చెబుతున్నారు.  ఆధార్‌ కౌంటర్ల వద్ద తీవ్ర జాప్యం జరుగుతుండటంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. 

విద్యార్థులకు అవస్థలు 
ఆధార్‌ సేవా కేంద్రాల వద్ద తమ ఫింగర్‌ ప్రింట్స్‌ అప్‌డేట్‌ చేసుకునేందుకు వచ్చే విద్యార్థులు పడే అవస్థలు అంతా ఇంతా కాదు. మహిళలు చిన్నపిల్లలతో పడిగాపులు కాస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది.   –కె.వెంకటేశ్వర్లు,  నెల్లూరు

తీవ్ర జాప్యంతో ఇబ్బందులు 
బ్యాంక్‌లు, పోస్టాఫీ సులవద్ద ఏర్పాటు చే సిన ఆధార్‌ సేవా కేం ద్రాల వద్ద తరచూ స ర్వర్‌ డౌన్‌ కావడంతో కార్డుల్లో మార్పులు చేయించుకునేందుకు తీవ్ర జాప్యం జరుగుతోంది. గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.  –సైదాపురం సతీష్, నెల్లూరు

సమస్యను మా దృష్టికి తెస్తే పరిష్కరిస్తాం 
ఆధార్‌ కేంద్రాల వద్ద సమస్యలను ఎవరైనా మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. సర్వర్‌ డౌన్‌ అనేది మా పరిధిలో ఏమి చేయలేం. కేంద్రాల వద్ద దరఖాస్తులు ఎక్కువ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. –డి.హరిత, ఆర్డీఓ, నెల్లూరు 

మరిన్ని వార్తలు