పగలకు వేదికలవుతున్న గణేష్ ఉత్సవాలు!

16 Sep, 2013 02:04 IST|Sakshi


 దోమ, న్యూస్‌లైన్: సంతోషంగా జరుపుకోవాల్సిన వినాయక చవితి ఉత్సవాలు పలు గ్రామాల్లో పగలు, ప్రతీకారాలకు వేదికలవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల సమయంలో తలెత్తిన వైషమ్యాలు ఉత్సవాల్లో పడగ విప్పుతున్నాయి. గ్రామాల్లో తీవ్ర రూపం దాల్చిన విభేదాల కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా మండల పరిధిలోని కిష్టాపూర్ అనుబంధ గ్రామం పలుగు తండాలో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, నిమజ్జనం సమయంలో అతడిని శత్రువులే హత్య చేశారని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామంలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలతో ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి.
 
  ఓ వర్గం నాయకులు కొందరు యువకులను రెచ్చగొట్టి అల్లర్లను సృష్టించే యత్నం చేస్తున్నారు.  మంగళ, గురు వారాల్లో జరగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమంలో శత్రువులను టార్గెట్ చేసి దాడులకు పాల్పడడానికి రంగం సిద్ధం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్వార్థపూరిత నాయకులు యువకులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారు. రెండు రోజుల క్రితం  రాత్రి వేళల్లో భజన కార్యక్రమాల పేరుతో అంగడి బజార్‌లో వినాయకుడిని ఏర్పాటు చేసిన ఓ ముగ్గురు యువకులు పలువురు స్థానికులపై పాత కక్షల నేపథ్యంలో గొడవలకు దిగి దాడులకు పాల్పడడం, బాధితులు స్టేషన్ దాకా వెళ్లడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. మండల పరిధిలోని దొంగెన్కెపల్లి, కొండాయిపల్లి, బడెంపల్లి, దిర్సంపల్లి, రాకొండ తదితర గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు చెబుతున్నారు. పలువురు ఉత్సవ కమిటీల నాయకులు ముందు జాగ్రత్త చర్యగా తమకు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నిమజ్జన కార్యక్రమం సాయంత్రం 6 గంటల లోపు పూర్తి చేసేలా పోలీసులు కఠిన నిబంధనలు రూపొందించాలని పలువురు కోరుతున్నారు. గొడవలు సృష్టించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటే అవాంఛనీయ ఘటనకు తావుండదని చెబుతున్నారు.
 
 
 

మరిన్ని వార్తలు