డీఎస్సీలో పర్సంటేజీల పితలాటకం!

13 Nov, 2018 04:06 IST|Sakshi

లాంగ్వేజి టీచర్‌ అభ్యర్థులకు శాపం

ఈ నిబంధనతో వేలాది మంది పరీక్షకు దూరమయ్యే అవకాశం

సిలబస్‌ కూడా పెనుభారం 

పైగా.. సిలబస్‌ ప్రకటించిన తేదీకి,పరీక్షకు 40రోజులే సమయం

కొత్త సిలబస్‌పై పీఈటీ అభ్యర్థులూ గగ్గోలు

ఫిజికల్‌ టెస్ట్‌కు అధిక మార్కులపై మండిపాటు

వయసు ఎక్కువున్న వారు వాటిని ఎలా అధిగమించగలరంటూ ఆవేదన

మరోవైపు.. తెలుగు తమ్ముళ్ల బేరసారాలు మొదలు

సాక్షి, విశాఖపట్నం/అమరావతి బ్యూరో:  డీఎస్సీ–2018లో ప్రభుత్వం పేర్కొన్న పర్సంటేజీ పితలాటకం లాంగ్వేజి టీచర్‌ అభ్యర్థులకు శాపంగా మారింది. బీఈడీలో ప్రవేశాలకు డిగ్రీ/పీజీల్లో ఓసీలు 50 శాతం, బీసీలు 40 శాతం మార్కులు సాధించాలి. డిగ్రీలో ఈ పర్సంటేజి లేనిపక్షంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌లోనైనా ఉండాలి. టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)లోనూ ఈ పర్సంటేజి ఉంటే చాలని పేర్కొన్నారు. అయితే, ఎస్‌జీటీ, స్కూల్‌ అసిస్టెంట్లు, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ల (టీజీటీల)కు డిగ్రీలో 50 శాతం ఉండాలని తాజా డీఎస్సీలో నిబంధన విధించారు. కానీ, డిగ్రీలో 50 శాతం ఉత్తీర్ణత శాతం లేని వారిని పీజీలో 50 శాతం ఉన్నా ఆన్‌లైన్‌లో ‘రిజెక్టెడ్‌’ అని వస్తోంది. దీంతో అర్హత ఉన్నా అన్యాయానికి గురవుతున్నామని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా, దరఖాస్తుల దాఖలుకు ఈనెల 16 వరకు మాత్రమే గడువుంది. 2018 డీఎస్సీ ద్వారా ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీలు వెరసి 7,907 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా అభ్యర్థులు దరఖాస్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిగ్రీ పర్సంటేజి 50 శాతం ఉండాలన్న నిబంధన వీరికి శరాఘాతంలా మారింది. ఈ నిబంధనతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది అభ్యర్థులు డీఎస్సీకి దూరమయ్యే ప్రమాదంలో పడ్డారు. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం నెల క్రితం డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేసింది. అందులో పీజీలో 50 శాతం ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులను డీఎస్సీకి అనుమతించారు. అదే మాదిరిగా రాష్ట్రంలోనూ పీజీలో 50 శాతం ఉన్న అభ్యర్థులను డీఎస్సీకి అనుమతించేలా మార్పులు చేయాలని వీరు కోరుతున్నారు. 

భారీ సిలబస్‌ కూడా భారమే..
ఇదిలా ఉంటే.. వచ్చే నెల 11న జరగనున్న డీఎస్సీ పరీక్షకు ఖరారు చేసిన సిలబస్‌ ఎంతో కఠినంగా ఉందని అభ్యర్థులు వాపోతున్నారు. ఉదా.. పీజీటీలకు 50 పాఠాలు.. విద్యా ధృక్పథాలు, మనోవిజ్ఞాన శాస్త్రం, జనరల్‌ నాలెడ్జి, కరెంట్‌ అఫైర్స్, ఇంగ్లీష్‌ మెథడాలజీ, ఇంగ్లీష్‌ గ్రామర్, కవులు, రచయితల గురించి రాయాల్సి ఉంటుంది. ఇంతటి భారీ సిలబస్‌ను అక్టోబరు 31న ప్రకటించారు. గతంలో తేలికగా ఉండే సిలబస్‌ను ప్రకటించిన తేదీకి, పరీక్షకు 60 రోజుల వ్యవధి ఉండేది. కానీ, ఇప్పుడు 40 రోజులే సమయం ఇచ్చి కఠిన సిలబస్‌ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. కాగా, దరఖాస్తు చేసుకున్న జిల్లాలో పోస్టులు ఖాళీ లేకపోతే పొరుగు జిల్లాల్లో రాసుకునే వెసులుబాటు కల్పించాలని డీఎస్సీ అభ్యర్థులు కోరుతున్నారు. 

పీఈటీ అభ్యర్థులకూ గందరగోళ పరిస్థితి
మరోవైపు.. పీఈటీ అభ్యర్థుల పరీక్షల విధానంలోనూ ప్రభుత్వం మార్పుచేసింది. కొత్త సిలబస్‌ను ప్రవేశపెట్టి వారిని గందరగోళంలోకి నెట్టింది. కోర్టు తీర్పుల ద్వారా తొలగించిన శారీరక సామర్థ్య పరీక్షలను తెరపైకి తెచ్చింది. ఈ నిర్ణయం కొంతమందికి మేలు చేయాలన్న తలంపుతో తెచ్చిందంటూ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అలాగే, రాత పరీక్షకు మార్కులు తగ్గించి ఫిజికల్‌ టెస్ట్‌కు అధిక మార్కులు కేటాయించడంవల్ల కూడా అర్హత కలిగిన అభ్యర్థులకు అన్యాయం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు.

టీడీపీ నేతల బేరసారాలు
ఈ నేపథ్యంలో కృష్ణా, నెల్లూరు, గుంటూరు జిల్లాలో అధికార పార్టీ నాయకులు అప్పుడే బేరాలకు తెరతీసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 30 మార్కులు ఫిజికల్‌ టెస్ట్‌లో సాధిస్తే ఉద్యోగం దాదాపు ఖాయమైనట్టేనన్న భావనతో కొందరు అభ్యర్థులు లక్షల్లో ముట్టచెప్పటానికి సిద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ వ్యక్తి తనకు రూ.10 లక్షలు ఇస్తే 30కి 28–29 మార్కులు వేయించగలనంటూ హామీలు ఇస్తున్న విషయం ఇప్పుడు కృష్ణాజిల్లా అవనిగడ్డ కోచింగ్‌ సెంటర్లలో హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా, వయో పరిమితిని జనరల్‌ కేటగిరి అభ్యర్థులకు 44 ఏళ్లు, ఇతరులకు 49 ఏళ్లుగా నిర్ణయించారు. ఆ వయసులో 800 మీటర్ల పురుగు పందెం, లాంగ్‌ జంప్, హైజంప్‌లను ఎలా పూర్తి చేయగలమంటూ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అలాగే, ఫిజికల్‌ టెస్ట్‌ రాత పరీక్షకు ముందు ఉంటుందా? తరువాత ఉంటుందా? అన్నదీ అంతుపట్టకుండా ఉంది.
 
సిలబస్‌ మార్పుతో సమస్యలు
ఏళ్ల తరబడి కోచింగ్‌లు తీసుకుని టెట్‌ పాసైన తరువాత డీఎస్సీ రాత పరీక్షకు సిలబస్‌ మార్చడం ఇబ్బందికరంగా ఉంది. తక్కువ సమయం ఉందనగా ప్రకటించడం, అందుకు తగ్గ పుస్తకాలు లభించకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం. 
– వాల్మీకి నరసింహ, పీఈటీ అభ్యర్థి, అనంతపురం

మేం ఎలా పరిగెత్తగలం.. 
అన్ని ఫిజికల్‌ టెస్టులు పాసై బీపీఎడ్‌ పట్టా పొందాను. నేను ఇప్పుడు గర్భిణిని. ఈ సమయంలో నేను ఎలా పరిగెత్తగలను. మహిళలకు పెళ్లి తర్వాత ఫిట్‌గా ఉండలేం. వీరిని దృష్టిలో ఉంచుకొని కొన్ని మినహాయింపులు ఇవ్వాలి.
– జీవన, పీఈటీ అభ్యర్థి, నెల్లూరు

మరిన్ని వార్తలు