తొట్టిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి

24 Feb, 2014 01:40 IST|Sakshi
తొట్టిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
  •   తొట్టిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
  •   కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
  • పామర్రు, న్యూస్‌లైన్ : పశువుల కోసం ఏర్పాటుచేసిన కుడితి తొట్టి ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఆ పాప తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చింది. మండలంలోని పెదమద్దాలి అంబేద్కర్ కాలనీలో ఈ విషాదం ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అంబేద్కర్ కాలనీకి చెందిన కలపాల కిషోర్, స్వరూపలకు కుమారుడు శ్యామ్, కుమార్తె సౌమ్య (సంవత్సరం దాటి ఐదు నెలలు) ఉన్నారు. ఆదివారం ఉదయం కిషోర్ పొలం పనులకు వెళ్లాడు.

    చిన్నారులు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా స్వరూప ఇంట్లో వంట పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ఆడుకుంటున్న సౌమ్య పక్కనే పశువుల కోసం ఏర్పాటు చేసిన కుడితి తొట్టి వద్దకు చేరుకుంది. ప్రమాదవశాత్తూ అందులో పడిపోయింది. అక్కడే ఆడుకుంటున్న మరో చిన్నారి ఈ విషయాన్ని తల్లికి తెలుపగా, ఆమె వచ్చేసరికి సౌమ్య స్పృహ కోల్పోయింది. వెంటనే చిన్నారిని మోపెడ్‌పై వైద్యశాలకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అప్పటికే సౌమ్య మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఒక్కగానొక్క కుమార్తె కళ్లముందే ఆడుకుంటూ మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
     

మరిన్ని వార్తలు