‘అనంత’ సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

20 Jun, 2020 05:40 IST|Sakshi
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి బొత్స. చిత్రంలో మంత్రులు అనిల్, శంకర్‌నారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు.

జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా ప్రాజెక్టు నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని అనంతపురం జిల్లా సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సత్వరం పనులు చేపట్టాలన్నారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో మంత్రి బొత్స మాట్లాడుతూ ఈ ప్రణాళికను 10 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. జూలై మొదటివారంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించే సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ హంద్రీ–నీవా కాలువ లైనింగ్‌ పనులు పూర్తి కాకపోవడంతో గతంలో గణనీయంగా నీరు వృథా అయ్యిందన్నారు. ఈ వృథాను అరికట్టడంతోపాటు పైనుంచి వస్తున్న నీటిని వాడుకొని జిల్లాలో అన్ని ప్రాంతాల అవసరాలు తీర్చేలా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ, ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి, అనంతపురం జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు