వస్త్ర, నగల దుకాణాలకు అనుమతి

27 May, 2020 04:11 IST|Sakshi

చెప్పుల షాపులు, స్ట్రీట్‌ ఫుడ్‌ విక్రయాలకు కూడా..

మార్గదర్శకాలు జారీ చేసిన పురపాలక శాఖ

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ కారణంగా మూతపడ్డ వస్త్ర, నగలు, చెప్పుల దుకాణాలను పట్టణ ప్రాంతాల్లో తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. జిల్లా కలెక్టర్లు కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో మినహా ఇతర ప్రాంతాల్లో మంగళవారం నుంచి దుకాణాలను తెరిచేందుకు షరతులతో కూడిన అనుమతినిస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీధుల్లో ఆహార పదార్థాల విక్రయ దుకాణాలకు కూడా అనుమతిని ఇచ్చింది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. 

మార్గదర్శకాలు: పెద్ద దుకాణాలు, షోరూంలలో కొనుగోలుదారులు ఆన్‌లైన్‌ ద్వారా బుకింగ్‌ చేసుకునేందుకు ప్రోత్సహించాలి. దుకాణం/ షోరూంలోకి ప్రవేశించే కొనుగోలుదారుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలి.  కొనుగోలుదారులకు థర్మల్‌ స్కానింగ్‌ చేసి, చేతులు శానిటైజ్‌ చేశాక లోపలికి అనుమతించాలి. శరీర ఉష్ణోగ్రత 99 డిగ్రీల ఫారన్‌హీట్‌ కంటే ఎక్కువ ఉన్నవారిని, కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నవారిని, మాస్కులు లేని వారిని అనుమతించకూడదు. కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్న సిబ్బందిని విధుల్లో ఉంచకూడదు. ప్రతి కౌంటర్‌ వద్ద ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద శానిటైజర్లు ఉంచాలి. 

► నగల దుకాణాల్లో కొనుగోలుదారులకు గ్లౌజులు ఇచ్చి.. వారు వాటిని ధరించాకే నగలను పరిశీలించేందుకు అనుమతించాలి. 
► వస్త్ర దుకాణాల్లో ట్రయల్‌ రూంలకు అనుమతి లేదు. 
► దుకాణాలు/ షోరూంలలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా గ్లౌజులు, మాస్కులు ధరించాలి.
► పెద్ద దుకాణాలు/షోరూంలలో ప్రవేశ ద్వారాల వద్ద పాదరక్షలకు డిస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఏర్పాటు చేయాలి.  వ్యాలెట్‌ పార్కింగ్‌ సదుపాయం కల్పించాలి (లేదా) ఖాతాదారులకు పార్కింగ్‌ ప్రదేశం చూపించాలి. వాహనాల తాళాలను శానిటైజ్‌ చేయాలి. పార్కింగ్‌ సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలి. టాయిలెట్లు ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసి తగినన్ని సబ్బులు, నాప్‌కిన్లు అందుబాటులో ఉంచాలి.
► షోరూం సిబ్బంది మాత్రమే లిఫ్టులను ఆపరేట్‌ చేయాలి. ఒకసారి ఒక వ్యక్తి/కలసి వచ్చిన బృందాన్ని మాత్రమే అనుమతించాలి. 
► దుకాణాలు, షోరూంలలో కొనుగోలుదారుల మధ్య ఆరు అడుగుల భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. అందుకోసం మార్కింగ్‌లు చేయాలి. 
► వీలైనంతవరకూ డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించాలి. కార్డు చెల్లింపులకు ముందు, తరువాత క్యాషియర్‌ కార్డులను శానిటైజ్‌ చేయాలి. నగదు చెల్లింపులు అయితే ఒకరిని ఒకరు తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
► కొనుగోలుదారులు సురక్షితంగా బయటకు వెళ్లేందుకు చేతులకు గ్లౌజులు వేసుకున్న షోరూం సిబ్బంది ద్వారం తెరవాలి. 
► పెద్ద దుకాణాలు/షోరూంలలో సిబ్బంది తమ దస్తులను ప్రత్యేకంగా భద్రపరచాలి. హెల్మెట్‌ వంటి వాటిని శానిటైజ్‌ చేసి ప్రత్యేకంగా భద్రపరచాలి. 

స్ట్రీట్‌ఫుడ్‌ విక్రయాలకు మార్గదర్శకాలు..
► ఆహార పదార్థాలను ‘టేక్‌ అవే’ (పార్సిల్‌) విక్రయాలకు మాత్రమే అనుమతి. అక్కడే కూర్చొని తినేందుకు అనుమతి లేదు.
► మున్సిపాలిటీ నుంచి ఇప్పటికే లైసెన్స్‌ పొందిన వారు మాత్రమే విక్రయించాలి. కొత్తగా లైసెన్సులు కావల్సిన వారు తమ పరిధిలోని వార్డు సెక్రటేరియట్‌కు వెళ్లి దరాఖాస్తు చేసుకోవాలి.
► ఆహార పదార్థాలు విక్రయించేవారు తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలి. మాస్కులు ధరించని కొనుగోలుదారులకు విక్రయించకూడదు.
► దుకాణదారు తన వద్ద సబ్బు/శానిటైజర్, టవల్‌ తప్పనసరిగా ఉంచుకోవాలి. ప్రతి అరగంటకు ఓసారి చేతులు శుభ్రం చేసుకోవాలి. కరోనా లక్షణాలు ఉన్నవారు దుకాణాలు నిర్వహించకూడదు. 
► వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఉన్న పానీపూరీ వంటి ఆహార పదార్థాల విక్రయాలకు అనుమతి లేదు.
► దుకాణం వద్ద ఐదుగురు కంటే ఎక్కువమంది ఉండకుండా చూడాలి. కొనుగోలుదారుల మధ్య తప్పనిసరిగా భౌతికదూరం పాటించేలా చూడాలి.
► మున్సిపల్‌ కమిషనర్లు తమ పరిధిలోని దుకాణదారులకు తగిన అవగాహన కల్పించాలి.  

మరిన్ని వార్తలు