మరో 11 ఇసుక రీచ్‌లకు అనుమతులు

7 Apr, 2016 01:09 IST|Sakshi

 కాకినాడ : జిల్లాలో మరో 11 ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసినట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తెలిపారు. కలెక్టరేట్ కోర్టు హాలులో బుధవారం జరిగిన జిల్లా పర్యావరణ అనుమతుల కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ప్రస్తుతం జిల్లాలో 23 రీచ్‌లుండగా, కొత్తగా గోవలంక, పిల్లంక, కమిని, కొమ్మనపల్లి, వెదుళ్ళపల్లి, తాడిపూడి, కాతేరు, కొత్తపేట, కేదార్లంక, తాతపూడి, కోరుమిల్లి రీచ్‌లకు పర్యావరణ అనుమతులు మంజూరు చేశారు.
 
 
  కపిలేశ్వరపురం-4 రీచ్ మైనింగ్‌కు అనువుగా లేదని పేర్కొంటూ ఈ రీచ్ ప్రతిపాదనను కమిటీ తిరస్కరించింది. అన్ని రీచ్‌లలో యంత్రాలు వినియోగించకుండా, కేవలం మనుషుల ద్వారా మాత్రమే తవ్వకాలు జరపాలని నిర్దేశించారు. గోవలంక, పిల్లంక, కమిని, కొమ్మనపల్లి రీచ్‌లను కేవలం పరిసర గ్రామాలు, కోనసీమ ప్రాంతవాసుల వినియోగానికి బోట్ల ద్వారా మాత్రమే తవ్వేందుకు అనుమతించారు. మిగిలిన ఏడు రీచ్‌లను జిల్లా అవసరాలకు నిర్దేశించారు.
 
  గన్నవరం మండలం ఎర్రంశెట్టిపాలెంలో రీచ్ నిర్వహణకు ఉన్న అవకాశాలను పరిశీలించి ప్రతిపాదించాలని మైనింగ్ ఏడీకి సూచించారు. వ్యవసాయానికి అనువైన రైతుల ప్రైవేటు భూముల్లో ఇసుక మేటల తొలగింపు కోసం వచ్చిన దరఖాస్తులపై కమిటీ సభ్య శాఖల అధికారులు ఉమ్మడిగా పరిశీలన జరిపి, అర్హత మేరకు అనుమతుల కోసం ప్రతిపాదించాలని కలెక్టర్ ఆదేశించారు.
 
 సమావేశంలో మైన్స్ ఏడీ రౌతు గొల్ల, గోదావరి హెడ్‌వర్క్స్ ఈఈ తిరుపతిరావు, పర్యావరణ కాలుష్య మండలి ఈఈ డి.రవీంద్రబాబు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సీఎస్‌ఆర్ మూర్తి, రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, డీఎఫ్‌వో టి.శ్రీనివాసరావు, భూగర్భ జలశాఖ డీడీ పీఎస్ విజయకుమార్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు