‘కంచే చేను మేసిన విధంగా టీడీపీ వ్యవహరించింది’

7 Nov, 2019 15:56 IST|Sakshi

సాక్షి, కృష్ణా : అగ్రిగోల్డ్‌ బాధితుల విషయంలో గత టీడీపీ ప్రభుత్వం కంచే చేను మేసిన విధంగా వ్యవహరించిందని రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని దుయ్యబట్టారు. జడ్పీ కన్వెన్షన్‌ సెంటర్‌లో మంత్రి నాని గురువారం అగ్రిగోల్డ్‌ బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. కష్టపడి సంపాధించుకున్న జీతాన్ని అగ్రిగోల్డ్‌లో దాచుకుంటే సదరు సంస్థ డిపాజిట్‌దారుల నుంచి కచ్చుటోపి పెట్టిందని, బాధితుల పక్షాన నిలబడి ఆదుకోవాల్సిన ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించిందని మంత్రి మండిపడ్డారు.

నాడు పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అగ్రిగోల్డ్‌ బాధితులకు భరోసా ఇస్తూ ముందుకు వెళ్లారని, నేడు ఇచ్చిన మాట ప్రకారం రూ. 10,000లు చొప్పున డిపాజిట్‌ చేసిన ప్రతి ఒక్క బాధితుడికి పరిహారం అందజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి అయిదు నెలలు కూడా గడవకమందే ఇచ్చిన మాట ప్రకారం డిపాజిట్‌ మొత్తాలను అందజేస్తున్నామని మంత్రి పేర్నినాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే​ మల్లాది విష్ణు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు