ఆలస్యంగా పింఛన్లు పంపిణీ చేయడంపై మంత్రి ఫైర్‌

1 Mar, 2020 13:40 IST|Sakshi

సాక్షి, కృష్ణా:  పింఛన్లు పంపిణీలో జాప్యం చేసిన గ్రామ వలంటీర్లపై రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వారిని విధుల నుంచి తొలగించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం మచిలీపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 21వ వార్డు జవ్వారుపేట టేక్యా ప్రాంతంలో మంత్రి పేర్ని నాని పర్యటించారు. ఈ సందర్భంగా 850 మీటర్ల పైపులైను పునరుద్ధరణ, నూతన పైపులైన్‌ ఏర్పాటు నిమిత్తం రూ.7 లక్షల 47 వేల రూపాయలతో జరిగే అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం మచిలీపట్నం 10వ వార్డులో పింఛన్‌లు ఇవ్వడంలో గ్రామ వలంటీర్లు రామకృష్ణ, అపర్ణ ఆలస్యం చేశారని మంత్రి దృష్టికి వచ్చింది. (గ్రామ స్వరాజ్యం.. సచివాలయాలతో సాకారం)

దీంతో వారిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించడమే కాక అడ్మిన్‌ నవీన్‌ అలసత్వంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 21వ వార్డు పార్టీ ఇన్‌చార్జ్‌ మాడపాటి వెంకటేశ్వరరావు, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ అచ్చాబా, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ సలార్ దాదా, మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొర్రా విటల్, షేక్ సైదా, శేఖర్, వాలిశెట్టి రవిశంకర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శివరామకృష్ణ, ఏఈ పిల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ ప్రభుత్వం లబ్ధిదారులకు ఇంటి వద్దకే పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. (ఏపీలో తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ)

>
మరిన్ని వార్తలు