ఆర్టీసీ విలీనం, సీపీఎస్‌ రద్దుపై కమిటీలు..

10 Jun, 2019 19:37 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన తొలి కేబినెట్‌ సమావేశం ముగిసింది. పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలు దిశగా ముఖ్యమంత్రి ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు ఐదున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశం.. రాష్ట్రంలోని సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా సాగింది. సోమవారం జరిగిన ఈ సమావేశంలో ఆర్టీసీ విలీనం, సీపీఎస్‌ రద్దుపై చర్చించడానికి కమిటీలను ఏర్పాటు చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆరు లేదా ఏడుగురు సభ్యులతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర  రైతు కమిషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రైతు భరోసా, అమ్మ ఒడి పథకాల అమలు తేదీలను ప్రకటించింది. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలపై మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ‘ప్రతి మంత్రి కూడా తమ శాఖలపై పట్టు సాధించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎవరైన మంచి సూచనలు చేస్తే పరిగణనలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే తక్షణమే విచారణ జరిపి.. తొలగిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. 

ఆర్టీసీ విలీనం, సీపీఎస్‌ రద్దుపై 
మానవీయ కోణంలో ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ విలీనానికి కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీపీఎస్‌ రద్దుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. తద్వారా ఎదరుయ్యే న్యాయపరమైన సమస్యలపై చర్చించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.

ఉద్యోగులు జీతాల పెంపుపై..
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జూలై 1 నుంచి 27 శాతం మధ్యంతర భృతి అందించాలని నిర్ణయం తీసుకున్నాం. ఆశావర్కర్ల జీతాల రూ. 3వేల నుంచి రూ. 10వేల పెంపుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలకు వెయ్యి చొప్పున జీతాల పెంపు నిర్ణయం తీసుకున్నాం. అంగన్‌వాడీ టీచర్లకు రూ. 10,500 నుంచి రూ. 11,500కు, అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ. 6వేల నుంచి రూ. 7వేలకు జీతాలు పెరగనున్నాయి. అన్ని శాఖల్లోని పారిశుద్ద్య కార్మికులకు 18 వేల రూపాయలు వేతనం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. మున్సిపల్‌ కార్మికుల, హోంగార్డుల పెంపుపై కూడా నిర్ణయం తీసుకున్నాం. ఇసుక అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇసుక తవ్వకాల్లో వ్యక్తులకు కాకుండా.. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

గ్రామ వాలంటీర్లకు ఇంటర్‌, పట్టణ వాలంటీర్లకు డిగ్రీ..
జూడీషియల్‌ కమిటీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటాం. జూడీషియల్‌ కమిటీ నిర్ణయాలను తూచ తప్పకుండా అమలుచేస్తాం. ఆంధ్ర్రప్రదేశ్‌ అవినీతి రహిత రాష్ట్రంగా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి పథకం కూడా డోర్‌ డెలివరీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 కల్లా గ్రామ వాలంటీర్లను నియమించేందుకు చర్యలు చేపట్టాం. పట్టణాల్లో మున్సిపల్‌ వార్డు వాలంటీర్లకు డిగ్రీ, గ్రామ వాలంటీర్లకు ఇంటర్‌ విద్యార్హత ఉండాలి. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాం. అక్టోబర్‌ 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ అమల్లోకి రానుంది.

అక్టోబర్‌ 15 నుంచి రైతు భరోసా..
నవరత్నాల్లో ఒకటైన రైతు భరోసా పథకం అక్టోబర్‌ 15 నుంచి ప్రారంభమవుతుంది. దీని కింద రైతులకు 12,500 రూపాయల సాయం అందనుంది. రైతులకు ఉచితంగా బోర్లు వేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకుల జోక్యం లేకుండా సహకార సంఘాల ద్వారా పెట్టుబడి సాయం అందజేస్తాం. రైతులందరికీ వడ్డీలేని రుణాలు ఇవ్వాలని కేబినేట్‌ నిర్ణయించింది. త్వరలోనే  దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ పేరుతో పథకాన్ని తీసుకొస్తాం. రైతులు కట్టాల్సిన రుణవడ్డీని ప్రభుత్వమే చెల్లించి.. ఆ రశీదును రైతులకు అందజేస్తాం. 2014 నుంచి 2019 వరకు చెల్లించకుండా ఉన్న రైతుల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లిస్తాం.  రూ. 3వేల కోట్లతో ధరల స్థీరికరణ నిధి, రూ. 2వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తాం. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ చేసే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. 

ఆడపడుచులకు ఉగాది కానుక..
గ్రామాల్లో ఇళ్లులేని అర్హులైన పేదలకు ప్రభుత్వమే ఇళ్ల స్థలాలు కొని.. ఆ ఇంట్లోని మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఉగాది రోజున అందజేస్తాం. వైఎస్సార్‌ గృహాల పేరుతో రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతాం. జనవరి 26 నుంచి అమ్మఒడి పథకం అమలు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా పిల్లలను బడులకు పంపే తల్లులకు రూ.15,000 చెక్కులు అందజేస్తాం. సెప్టెంబర్‌ 1 నుంచి రేషన్‌ హోం డెలివరీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నాణ్యమైన మేలు రకం బియ్యాన్ని వాలంటీర్ల ద్వారా డోర్‌ డెలివరీ చేస్తాం. బియ్యంతో పాటు ఐదారు నిత్యావసర వస్తువులను  జత చేసి ప్రజలకు అందజేస్తాం.

పాఠశాలల ఆధునీకరణ
ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరచాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. 40 వేల ప్రభుత్వ పాఠశాలలను రీమోడలింగ్‌ చేసేందుకు ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలలను ఫొటోలు తీసి వాటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. 40 కి.మీ పరిధిలో మధ్యాహ్నం భోజన పథకం కోసం కేంద్రీకృత వంటగది ఏర్పాటు చేసి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేస్తాం. ఫీజుల నియంత్రణ, మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు చేపడతాం. 

108, 104 వాహనాలపై..
సహకార రంగం పునరుద్ధరణ తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూతపడిన షుగర్‌ ప్యాక్టరీల పునరుద్దరణకు తక్షణమే చర్యలు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నాం. కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్దీకరించేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం ఆయా శాఖల మంత్రులతో సబ్‌ కమిటీ ఏర్పాటు చేసి త్వరితగతిన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూలనపడిన 108, 104 వాహనాల స్థానంలో కొత్తవాటిని తీసుకొస్తాం. ఫోన్‌ చేసిన 25 నిమిషాల్లో 108, 104 అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరన్ని సేవలను తీసుకురావాలని నిర్ణయించాం. గిరిజన ప్రాంతాల్లోని కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లకు పెంపుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. వారి వేతనాలను రూ. 400 నుంచి రూ. 4వేలకు పెంచుతున్నాం. సామాజిక పింఛన్లు 2,250 రూపాయలకు పెంపుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా..
అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవడం కోసం 1150 కోట్ల రూపాయలు కేటాయించాం. తద్వారా 20వేల రూపాయల లోపు డిపాజిట్‌ చేసినవారి 9 లక్షల మందికి లబ్ధి చేకూరనుంద’ని తెలిపారు.
 

మరిన్ని వార్తలు