జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులే 

31 Dec, 2019 04:07 IST|Sakshi

సిబ్బంది కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎంకు అందరూ జేజేలు పలకాలి 

సంక్రాంతి పండుగ సందర్భంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తే 8309887955కు ఫిర్యాదు చేయండి 

రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని 

సాక్షి, అమరావతి: జనవరి 1 నుంచి ఆర్టీసీ కార్మికులందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులేనని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే రూ.6,400 కోట్ల మేరకు నష్టాల్లో ఉందన్నారు. దీనికితోడు ఏటా రూ.3,600 కోట్ల భారాన్ని ప్రభుత్వం తన భుజాన వేసుకుందని చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నాని మీడియాతో మాట్లాడారు. 54 వేల ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అందరూ జేజేలు పలకాలని కోరారు. సీఎం తీసుకున్న నిర్ణయం దేశంలోనే ఒక చరిత్రాత్మక సంఘటనగా నిలిచిపోతుందన్నారు. సంక్రాంతికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చే వారి నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌ రెండు, మూడు రెట్లు అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికొచ్చిందని.. ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. ఎక్కడైనా అధికంగా చార్జీలు వసూలు చేస్తే 8309887955 నంబర్‌కు వాట్సాప్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. 

చంద్రబాబు మాటలే జర్నలిస్టులపై దాడికి కారణం
రాజధాని ప్రాంతంలో మహిళా జర్నలిస్టు దీప్తి, మరికొందరిపై దాడి చేస్తే జర్నలిస్టు సంఘాలు ఎందుకు స్పందించలేదని మంత్రి నాని ప్రశ్నించారు. అక్రెడిటేషన్‌ కార్డుల కోసం బయలుదేరే జర్నలిస్టు సంఘాలు, యూనియన్లు.. హరీష్‌ (ఎన్టీవీ), వసంత్‌ (మహాటీవీ), కెమెరామెన్లు, డ్రైవర్లపై దాడి జరిగితే ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. దాడికి గురైన జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఇంటికి వెళ్లి చంద్రబాబు ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పిన మాటలే ఇలాంటి సంఘటనలకు కారణమని ధ్వజమెత్తారు. టీవీ9 ఇటీవల వరకూ వారు చెప్పినట్లు వార్తలు ఇచ్చిందని.. ఇప్పుడు అలా చేయడం లేదనే అక్కసుతోనే దాడి చేశారన్నారు. తమపై రోజూ విషం చిమ్మే ఏబీఎన్, టీవీ5 చానెళ్లను ఏనాడైనా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ముట్టుకున్నారా? అని ప్రశ్నించారు. సుజనా చౌదరి భారతీయ తెలుగుదేశం పార్టీకి చెందిన వారని.. ఆయన మాటలు టీడీపీవేనని.. అందువల్ల ఆయన చెప్పే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇక పవన్‌ నాయుడు ఎవరి కోసం పని చేస్తారో అందరికీ తెలిసిందేనని చెప్పారు.

51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి
జనవరి 1 నుంచి ఆర్టీసీ సిబ్బంది ప్రజా రవాణా ఉద్యోగులుగా మారనున్నారు. దేశంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌ మినహాయించి ఏ రాష్ట్రంలోనూ ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల ఆ సంస్థలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న 51,488 మందికి లబ్ధి చేకూరనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను ప్రజా రవాణా శాఖలో విలీనమైన వెంటనే చెల్లించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 

విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులకు కలిగే ప్రయోజనాలు..
- సంస్థకు ఆర్థిక భద్రత చేకూరడం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఉద్యోగ భద్రత ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందుతాయి. 
ఆర్టీసీ లాభనష్టాలతో సిబ్బందికి సంబంధం ఉండదు. పదవీ విరమణ 
వయసు 60 ఏళ్లుగా ఉంటుంది. 
కార్మికులకు రావాల్సిన పెండింగ్‌ బకాయిలను రెండేళ్లలో చెల్లిస్తారు. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ ఉద్యోగులకు లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ కింద రూ.47 కోట్ల మేర బాండ్లు ఇచ్చారు. ఆ బాండ్లకు నగదు చెల్లిస్తారు. 
ఆర్టీసీ సిబ్బందిపై అనవసర ఒత్తిళ్లు ఉండవు.. అధికారుల పెత్తనం తగ్గుతుంది. పనిష్మెంట్లు ఇష్టారీతిన ఇచ్చేందుకు కుదరదు.  

ప్రజా రవాణా శాఖ ఏర్పాటు
రవాణా, ఆర్‌ అండ్‌ బీ పరిపాలన నియంత్రణలోనే పీటీడీ శాఖ
రవాణా, ఆర్‌ అండ్‌ బీ పరిపాలన నియంత్రణలో ప్రజా రవాణా శాఖ (పీటీడీ)ను ఏర్పాటు చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రజా రవాణా శాఖ ఏర్పాటైంది. ఆర్టీసీ విలీనంపై రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఆంజనేయరెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ సెప్టెంబర్‌లో ప్రభుత్వానికి నివేదిక అందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పీటీడీ ఏర్పాటుపై కార్యదర్శుల కమిటీ కొన్ని సూచనలు చేసింది. పిదప ఆర్టీసీ బోర్డు కూడా విలీనాన్ని ఆమోదించింది. దీంతో జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం కానున్నారు. ఫిబ్రవరి 1న వీరికి ప్రభుత్వమే వేతనాలు చెల్లించనుంది. కార్యదర్శుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఆర్థిక శాఖ చర్యలు చేపట్టనుంది. ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల చెల్లింపులు ఏపీసీఎఫ్‌ఎంఎస్‌ (ఆంధ్రప్రదేశ్‌ కాంప్రహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) ద్వారా జరుగుతాయి. వేతన సవరణ అమలు చేసే వరకు ప్రస్తుతం ఆర్టీసీలో కొనసాగుతున్న అలవెన్సులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కార్యదర్శుల కమిటీ ప్రతిపాదించిన పే స్కేల్స్‌ను వేతన సవరణ కమిటీకి నివేదించి అనుమతి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.  

పీటీడీ వ్యవస్థాగత నిర్మాణం ఇలా..
రవాణా శాఖ మంత్రి.. ప్రజా రవాణా శాఖ మంత్రిగా, రవాణా, ఆర్‌ అండ్‌ బీ శాఖ ముఖ్య కార్యదర్శి.. ప్రిన్సిపల్‌ సెక్రటరీగా, పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కమిషనర్‌/డైరెక్టర్‌గా.. ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రధాన కార్యాలయంలో ఈడీలు అదనపు కమిషనర్లుగా, రీజినల్‌ మేనేజర్లు జాయింట్‌ కమిషనర్లుగా, డివిజనల్‌ మేనేజర్లు డిప్యూటీ కమిషనర్లుగా, డిపో మేనేజర్లు అసిస్టెంట్‌ కమిషనర్లుగా వ్యవహరిస్తారు. జోనల్‌/రీజియన్లలో ఉండే ఈడీలు, ఆర్‌ఎంలు, డీవీఎంలు, డీఎంలకు ఇవే హోదాలు వర్తిస్తాయి. వీరు జిల్లాల్లో ఉంటారు. 

మరిన్ని వార్తలు