అందుకే ఇంగ్లీష్‌ మీడియం బోధన : పేర్నినాని

13 Nov, 2019 15:56 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం బోధనకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంలో బోధన చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమిటీ సూచనలు, పేరెంట్స్‌ అభిప్రాయాల మేరకే ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నామన్నారు. పోటీ ప్రపంచాన్ని తట్టుకోవడానికే ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. తప్పనిసరిగా మాతృభాష తెలుగు ఒక సబ్జెక్ట్‌గా ఉంటుందని స్పష్టం చేశారు. 

ఇసుక అక్రమ రవాణా చేస్తే జైలుకే
ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.2లక్షలు, రేండేళ్ల జైలు శిక్ష ఉంటుందన్నారు. ఇసుక నిల్వ చేసే, అమ్మే అధికారం ఎవరికీ లేదన్నారు. రోజుకు 2లక్షల టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. పది రోజుల్లో డిమాండ్‌కు తగ్గట్లుగా ఇసుక సరఫరా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 

పారిశ్రామిక వ్యర్థాలపై ఆడిట్‌ నిర్వహిస్తాం
పారిశ్రామిక వ్యర్థాలను నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. వ్యర్థాలపై ఆడిట్‌ నిర్వహిస్తామని చెప్పారు. దీనికోసం ఏపీ పర్యావరణ మేనేజ్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రమాదవశాత్తు మత్య్సకారులు చనిపోతే వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద రూ.10లక్షలు అందిస్తామన్నారు. సోలార్‌, పవన విద్యుత్‌ పాలసీలకు సవరణలు చేస్తామన్నారు. గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదించిందన్నారు. న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టానికి సవరణలు తీసుకువస్తామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు విజయనగరం, కర్నూలు జిల్లాలలో అత్యవసరంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు