ఉద్యో‍గస్తుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: పేర్ని నాని

8 Feb, 2020 20:12 IST|Sakshi

సాక్షి, విజయవాడ : మంత్రిగా ఉండే రెండున్నర సంవత్సర కాలంలో తనను కలిసిన ప్రతి వ్యక్తికి న్యాయం జరిగేలా చూస్తానని రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలతో జేఏసీ గొప్ప గొంతుగా నిలవడం శుభపరిణామమని మంత్రి పేర్కొన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలు ఎన్ని ఉన్నా ఉద్యోగులకు న్యాయం జరిగితే చాలు అని అన్నారు. చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారికి అండ కల్పిస్తూ ప్రస్తుతం కారుణ్య నియామకాలు చేపట్టామని తెలిపారు. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన వెంటనే కారుణ్య నియామకాలు జరపాలని ఆలోచన చేశామన్నారు. మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి  కారుణ్య నియామకాలలో ఎవ్వరినీ అనర్హుల జాబితాలో పెట్టలేదని అన్నారు. మానవత్వం, హృదయంతో ఆలోచించి మంత్రులుగా పాలన అందించాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని మంత్రి తెలిపారు. 2014 తర్వాత పాలకులు ఉద్యోగ సంఘ నాయకుల ప్రవర్తనలో మార్పు వచ్చిందని, ఎన్నికల ప్రచారాలకు కూడా ఉద్యోగ సంఘాల నాయకులు వచ్చారని గుర్తు చేశారు. సీఎం జగన్‌ ప్రభుత్వానికి సంఘం, జెండాలతో పనిలేదని జెండా నీడలో ఉన్న కార్మికులే ముఖ్యమని తెలిపారు.

ప్రజల ఆశయాల మేరకు ప్రభుత్వం పనిచేయాలి
ఉద్యోగస్తుల సంక్షేమమే తమ ప్రభుత్వం లక్ష్యమని మంత్రి తెలిపారు. సీపీఎస్‌ రద్దుకు ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని తెలిపారు. సీఎం జగన్‌ చెప్పాడంటే చేస్తాడని అన్నారు. విపరీతమైన ఆర్థిక బాధలు ప్రభుత్వానికి ఉన్నాయని, అందుకే ఆలస్యం అవుతుందన్నారు. మీ నమ్మకాన్ని ముఖ్యమంత్రి వమ్ము చేయరని, మూడు రాజధానుల అంశంలో తమ మద్దతుకు జేజేలు పలుకుతున్నామన్నారు. సీఎం జగన్‌ నిర్ణయానికి అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ఆశలు ,అంచనాల మేర ప్రభుత్వం పని చేయాలని, ముఖ్యమంత్రి ప్రభుత్వం చిన్న ఉద్యోగి నుంచి అందరికీ ఋణపడి ఉంటుందన్నారు. తమకు ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా కల్పించారు. 

ప్రభుత్వం నీతిమంతులకు అండగా ఉంటుంది
‘‘అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 85  నుంచి 90 శాతం సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల  హామీలు నెరవేర్చగలడానికి  కారణం మీరే. మీ శ్రమ ద్వారా ఈ ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంది. మీ త్యాగం ప్రభుత్వం మరువదు. మీ గొంతులోని తీవత్ర ఆద్రత ముఖ్యమంత్రి చెవిలో వేస్తాను. అవినీతి ఆలోచనలు చేస్తే 2 నిమిషాల్లో పీకేస్తానని సీఎం తెలిపారు. రవాణ శాఖలో లంచం లేకుండా ప్రమోషనన్లు ఈ ప్రభుత్వంలోనే జరిగాయి. మా ప్రభుత్వం నీతిమంతులకు అండగా ఉంటుంది. డబ్బు కోసం అధికారులు ప్రజలను పీడించకుండా ఉండాలి. హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తాము. ఉద్యోగులకు ఈ .హెచ్ .యస్ హెల్త్  కార్డు అందేలా చర్యలు తీసుకుంటాము. క్లాస్ 4 ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాము. ఆర్టీసీ బస్టాండులో  ప్రవేటు స్కూల్ బస్సులు రానీయం. ప్రభుత్వ డ్రైవర్లు, మహిళా ఉద్యోగులు, బాషాపండిట్‌ల సమస్యలు పరిష్కరిస్తాం’’. అని ప్రభుత్వ ఉద్యోగులను ఉద్ధేశించి మంత్రి మాట్లాడారు.

మరిన్ని వార్తలు