2500 ఎకరాల్లో బందరు పోర్టు

28 Apr, 2020 08:09 IST|Sakshi
పసిపూడి వద్ద పోర్టు నిర్మాణ ప్రాంతాన్ని  పరిశీలిస్తున్న మంత్రి పేర్ని నాని 

472 ఎకరాల భారత్‌ సాల్ట్‌  ల్యాండ్స్‌ సేకరణ 

భూమికి భూమి పద్ధతిలో స్వాదీనం 

సాగరమాల కింద 47 కి.మీ. పోర్టు కనెక్టివిటీ రహదారి 

సాక్షి, మచిలీపట్నం: బందరు పోర్టు అభివృద్ధి కోసం 2500 ఎకరాల ప్రభుత్వ భూమి సిద్ధంగా ఉందని, పోర్టుకు అతి సమీపంలో ఉన్న 472 ఎకరాల భారత్‌ సాల్ట్‌ ల్యాండ్‌ను కూడా పోర్టు సమగ్రాభివృద్ధిలో భాగంగా సేకరించాలని నిర్ణయించారు. సోమవారం రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్, సంబంధిత ఉన్నతాధికారులతో కూడిన బృందం రాష్ట్రమంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)తో కలిసి పోర్టు నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతంలో పర్యటించింది. తొలుత తపసిపూడి, మంగినపూడి ప్రాంతాలతోపాటు గిలకలదిండిలోని ఫిషింగ్‌ హార్బర్‌ను పరిశీలించి మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో పోర్టు నిర్మాణం కోసం తీసుకుంటున్న చర్యపై సమీక్షించారు. ఇప్పటికే సిద్ధం చేసిన పోర్టు నిర్మాణ డిజైన్స్‌ను పరిశీలించిన మంత్రి పేర్ని నాని అధికారులకు పలు సూచనలు చేశారు.

ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి భూమికి భూమి పద్ధతిలో ఈ సాల్ట్‌ ల్యాండ్స్‌ను సేకరించాలని ప్రతిపాదించారు. ఇప్పటికే మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, దాని ద్వారా పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. కార్పొరేషన్‌ ద్వారా నిధుల సమీకరణ కోసం ముందుకొచ్చే బ్యాంకర్లతో చర్చలు జరిపి ఆర్థిక వనరుల సేకరణపై కసరత్తు మొదలు పెట్టాలని సూచించారు. ఎంత వ్యయం అవుతుంది..ఏ ఏ ఆర్థిక సంస్థలు మేరకు ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకొస్తున్నాయో అంచనాకు వచ్చిన తర్వాత తొలి దశ పనులకు టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేయాలని నిర్ణయించారు.

సాధ్యమైనంత త్వరగా పోర్టు పనులు ప్రారంభించేందుకు వీలుగా అవసరమైన కసరత్తును పూర్తి చేయాలని మంత్రి పేర్ని నాని అధికారులను ఆదేశించారు. సమీక్షలో మారిటైం బోర్డు సీఎండీ రామకృష్ణారెడ్డి, ఏపీ అర్బన్‌ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ సీఇఒ ప్రకా‹Ùకౌర్, ముడా వీసీ పి.విల్సన్‌బాబు, ఆర్డీఒ ఎస్‌ఎస్‌కే ఖాజావలి, మత్స్యశాఖ ఏడీ రమణబాబు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు