అత్తగారింటికి బయల్దేరి.. అనంతలోకాలకు..

29 Dec, 2013 03:00 IST|Sakshi

 తాండూరు, న్యూస్‌లైన్: అత్తగారింటికి తోడల్లుళ్లు ఎంతో సంతోషంగా బయలుదేరారు. రాత్రి భార్యాపిల్లలతో సరదాగా మాట్లాడారు. అంతలోనే వారిలో ఒకర్ని రైలు ప్రమాదం కబళించింది. మరో వ్యక్తి రైలు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. రైలు ప్రమాదంలో సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఉద్యోగి ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. శనివారం తెల్లవారుజామున అనంత పురం జిల్లా పుట్టపర్తి సమీపంలో బెంగళూరు-నాందేడ్(నెం.16594) లింక్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు.. తాండూరు మండలం కరన్‌కోట్‌కు చెందిన అనంతరావు పట్టణంలోని మారికాంబకాలనీలో ఉంటూ స్థానిక కాంగ్రెస్ పార్టీ నేత వద్ద వ్యాపార వ్యవహారాలు చూస్తున్నాడు.

 కర్ణాటక రాష్ట్రానికి చెందిన కండోభా కులకర్ణి(32) కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో స్థిరపడింది. కులకర్ణి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం అనంతరావు పెద్ద కూతురు శ్వేతను కులకర్ణికి వివాహం చేసుకున్నాడు. దంపతులకు పిల్లలు అంబరీష్(7), సర్వశ్రీ(3) ఉన్నారు. అనంతరావు రెండో కూతురు లతను చెన్నైలో సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తున్న శ్రీకాంత్(28) ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల తాండూరులో అనంతరావు బావ మృతిచెందాడు. దశదిన కార్యక్రమం నిమిత్తం వారం రోజుల క్రితం బెంగళూరు నుంచి శ్వేత తన పిల్లలతో, చెన్నై నుంచి లత తాండూరుకు చేరుకున్నారు. క్రిస్మస్ సెలవులు కలిసి రావడంతో భార్యాపిల్లలతో సరదాగా గడిపేందుకు కులకర్ణి, శ్రీకాంత్ తాండూరుకు రావాలనుకున్నారు. దీంతో శ్రీకాంత్ బెంగళూరులోని తోడల్లుడు కులకర్ణి వద్దకు వెళ్లాడు.

 ఇద్దరూ కలిసి శుక్రవారం రాత్రి 10.30 గంటలకు బెంగళూరు- నాందేడ్ లింక్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. ఏసీ బీ-1 బోగీలోని 17వ బెర్తులో కులకర్ణి, 20వ బెర్తులో శ్రీకాంత్ కూర్చున్నారు. 11 గంటల సమయంలో కులకర్ణి, శ్రీకాంత్‌లు సెల్‌ఫోన్‌లో తమ భార్యాపిల్లలతో సరదాగా మాట్లాడారు. తెల్లవారుజామున బీ-1 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందు శ్రీకాంత్ బోగీలోని బాత్‌రూమ్‌కు వెళ్లాడు. మంటల్లో చిక్కుకున్న కులకర్ణి సజీవ దహనం అయ్యాడు. మంటలను గమనించిన శ్రీకాంత్ రైల్లోంచి కిందికి దూకడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. ప్రమాద విషయమై శ్రీకాంత్ వేరొకరి సెల్‌ఫోన్ ద్వారా చెన్నైలోని తన తండ్రికి సమాచారం ఇచ్చాడు. ఆయన తాండూరులోని వియ్యంకుడు అనంతరావుకు సమాచారం చేరవేశారు. హఠాత్పరిణామానికి తాండూరులోని అనంతరావుతోపాటు ఆయన కూతుళ్లు శ్వేత, లత, కుటుంబీకులు షాక్‌కు గురయ్యారు.

 సాయంత్రం 5 గంటలకు కులకర్ణి తీవ్రగాయాలతో అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు రైల్వే కంట్రోల్ రూమ్ నుంచి తాండూరు రైల్వే అధికారులకు సమాచారం వచ్చింది. కులకర్ణి మరణించారని, మృతదేహాన్ని బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో భద్రపరిచినట్లు సుమారు 5.50 గంటలకు కంట్రోల్‌రూమ్ నుంచి మరోసారి సమాచారం వచ్చిందని తాండూరు రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ చెప్పారు. అనంతరావు కుటుంబీకులు ఘటనా స్థలానికి బయలుదేరారు.

మరిన్ని వార్తలు