రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

15 Mar, 2017 23:18 IST|Sakshi

ఎచ్చెర్ల క్యాంపస్‌ : మండలంలోని తమ్మినాయుడుపేట సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. శ్రీకాకుళం రూరల్‌ మండలం వాకలవలసకు చెందిన  బెండు రామారావు(32), చింతాడ సురేష్‌లు ఫ్లోరింగ్‌ మేస్త్రిలుగా పనిచేస్తున్నారు. పైడి భీమవరంలో పని ముగించుకొని బైకుపై ఇంటికి చేరుకునే క్రమంలో తమ్మినాయుడుపేట సమీపంలో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌ నడుపుతున్న రామారావు అక్కడికక్కడ మృతి చెందాడు.

 గాయపడిన సురేష్‌ను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో ప్రాణాపాయం తప్పింది. మృతుడు రామారావుకు భార్య ధనలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎచ్చెర్ల ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు