కలలు చెదిరి..కన్నీళ్లు మిగిలి..

13 Jul, 2019 06:48 IST|Sakshi
విషాదంలో ఉన్న మృతుని భార్య, పిల్లలను పరామర్శిస్తున్న దేవన్‌రెడ్డి(ఇన్‌సెట్‌) మృతుడు సూర్యనారాయణ (ఫైల్‌) 

మూడు రోజుల్లో వస్తానని తిరిగిరాని లోకాలకు..

మలేషియాలో గాజువాక వాసి మృతి

అనాథలుగా భార్య, పిల్లలు

సాక్షి, గాజువాక: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి దుర్మరణం పాలవడంతో గాజువాకలో విషాదఛాయలు అలముకున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఇంటికి తిరిగొస్తానని చెప్పిన ఆ వ్యక్తి మృతి చెందినట్టు కబురు రావడంతో ఆ కుటుంబం కన్నీటిపర్యంతమవుతోంది. వివరాలిలా ఉన్నాయి. పాతగాజువాక దరి టీవీఎన్‌ కాలనీకి చెందిన కె.సూర్యనారాయణ(45) ఉపాధి కోసం ఏడాదిన్నర క్రితం మలేషియా వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్‌ కంపెనీలో వెల్డర్‌గా పని చేస్తున్నాడు. వీసా గడువు ముగిసినప్పటికీ తిరిగి రాకుండా అక్కడే మరో కంపెనీలో ఉద్యోగంలో చేరడానికి ప్రయత్నించాడు. పని దొరక్కపోవడంతో తాను తిరిగి వచ్చేస్తానని భార్య జయకు ఫోన్‌ చేసి చెప్పాడు. తనవద్ద డబ్బులు లేవని, డబ్బులు పంపిస్తే రెండు మూడు రోజుల్లో వచ్చేస్తానని చెప్పాడు. దీంతో ఆమె తనకు తెలిసివారి వద్ద రూ.30వేలు అప్పు చేసి భర్త అకౌంట్‌లో జమ చేసింది.

డబ్బులు అందుకున్న సూర్యనారాయణ ఇక బయల్దేరడమే తరువాయి అని భార్యకు చెప్పాడు. భర్త రాక కోసం ఎదురుచూస్తున్న జయకు అతడు బాత్‌ రూమ్‌లో కాలుజారి పడిపోవడంతో మృతి చెందినట్టు సమాచారం అందింది. సూర్యనారాయణతో పాటు అదే రూమ్‌లో ఉంటున్నవారు ఈ విషయాన్ని ఆమెకు ఫోన్‌లో చెప్పారు. వీసా గడువు ముగియడంతో మృతదేహం పంపేందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఏడాదిన్నర క్రితం అతడు ఉపాధి కోసం విజిటింగ్‌ వీసాపై వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వీసా గడువు ముగియడంతో మృతదేహం విడుదల చేయడానికి అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరు కాలేదు. దీంతో తన భర్త మృతదేహాన్ని రప్పించాలని మృతుని భార్య జయ వేడుకుంటోంది. మృతునికి భార్యతో పాటు లోకేష్, ఉదయ్‌కుమార్‌ అనే ఇద్ద కుమారులున్నారు. తండ్రి మరణంతో వారు పెద్ద దిక్కును కోల్పోయారు. జీవితంపై ఎన్నో కలలు కన్న ఆ కుటుంబానికి చివరికి కన్నీళ్లు మిగిలాయి.

వైఎస్సార్‌సీపీ నాయకుల పరామర్శ
సూర్యనారాయణ మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ సీనియర్‌ నాయకుడు తిప్పల దేవన్‌రెడ్డి.. టీవీఎన్‌ కాలనీలోని మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ విషయాన్ని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు తెలియజేసి మృతదేహాన్ని తీసుకురావడానికి సహకరించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నాయకులతో కూడా ఆయన ఫోన్‌ చేసి మాట్లాడారు. మృతదేహాన్ని పంపించడానికి వారు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా దేవన్‌రెడ్డి తెలిపారు. మృతుని కుటుంబాన్ని మాజీ కార్పొరేటర్‌ ఉరుకూటి అప్పారావు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఉరుకూటి చందు, దొడ్డి రమణ తదితరులు పరామర్శించారు. 

>
మరిన్ని వార్తలు