భైరవ కుటీరం

10 Aug, 2018 11:06 IST|Sakshi
శునకాలకు ఔషధాన్ని తాగిస్తున్న ఏసుపాదం బాబు

ఊరికి దూరంగా నివాసం ఇంటినిండా శునకాలే

కుటుంబ సభ్యులకు రోజంతా వాటిసేవే

ప్రేమాభిమానంతో పెంపకం

జీవకారుణ్యానికి నిలువెత్తు నిదర్శనం

మూలికావైద్యుని నిస్వార్థ సేవ

కుక్కలు కనిపించగానే చాలా మంది భయపడతారు. కొందరు కసురుకుంటారు. వీలుంటే ఓ రాయి విసురుతారు. కానీ ఈ కుటుంబం ఇందుకు భిన్నం. 53 శునకాలను తమతోపాటు ఇంట్లో ఉంచుకుంటున్నారు. వాటికి ప్రేమాభిమానం పంచుతున్నారు. ఇతరులకు ఇబ్బంది కలగకూడదని ఊరికి చివర నివాసమేర్పరుచుకున్నారు. వాటి సేవలోనే రోజంతా గడుపుతున్నారు.

ఆ ఇంటికి వెళ్తే భౌ భౌ అంటూ అరుపులు వినిపిస్తాయి. ఇదేంటి ..చాలా ఇళ్లలో పెంపుడు కుక్క అరుస్తుంది కదా అనుకుంటున్నారా..ఒకటైతే ఓకే..ఏకంగా 53శునకాలు.. ఆశ్చర్యంగా ఉంది కదూ..ఔను నిజమే..ఇన్ని భైరవులున్న ఆ ఇల్లు చిన్నదే..కానీ ఆ ఇంటి యజమాని మనసు మాత్రం చాలా పెద్దది.  ఓ చిన్న గదిలో కుటుంబ సభ్యులుంటూ మిగిలిన చోటంతా కుక్కలకే ఇచ్చేశారు. రోజూ వాటిని ప్రేమతో సాకుతున్నారు. ఒక కుక్కను పెంచడమే కష్టమనుకునే రోజుల్లో తనసంపాదనంతా వాటికే వెచ్చిస్తున్నారు. అవి కూడా తమ కుటుంబ సభ్యులే అనిచిరునవ్వుతో సమాధానమిస్తారీ మధ్యతరగతి ప్రకృతి వైద్యుడు..ఆయన వాటినిభైరవులుగా సంబోధిస్తారు. ఆయన నిస్వార్ధ సేవ గురించి తెలుసుకుందామా..

చిత్తూరు, నాగలాపురం: అది నాగలాపురం మండలం.. రాజులకండ్రిగ గ్రామానికి దూరంగా కొండలు..పచ్చని పొలాల మధ్య ఓ ఇల్లు.. జన సంచారం పెద్దగా కనిపించదు. ఆ ఇంట్లోకి తొంగి చూస్తే ఓ ముగ్గురు వ్యక్తులు శునకాలకు సేవ చేస్తూ కనిపిస్తారు. వారే ఏసుపాదం బాబు, ఆయన భార్య రిబ్కా, కుమార్తె ప్రియ. వీరు ముగ్గురూ జీవకారుణ్యమున్నవారే. ఆయనేమీ పెద్ద స్థోమతుపరుడు కాదు. ఇల్లుకూడా సొంతం కాదు. ఆయన సోదరిచ్చినదే. ఆత్మాభిమానం మెండు. చిన్న పాటి సేవలకే ఎంతో ప్రచారం కోరుకునే రోజుల్లో ఆయన ఏనాడూ తన సేవల గురించి ఎవరికీ చెప్పరు. ఎవరి సాయమూ తీసుకోరు కూడా.  తన చిరు సంపాదనతో కుటుంబాన్ని  ..భైరవులను పోషిస్తున్నారు. ఇక్కడున్న భైరవుల్లో  అధిక భాగం ఎవరో గాలికొదిలేసినవే.   వాటిని కన్నబిడ్డల్లా కాపాడుతున్నారు.  స్వార్థ చింతన లేని ప్రేమను పంచుతున్నారు. జీవకారుణ్యం పదానికి నిలువెత్తు నిదర్శనం ఈ కుటుంబమే. 

రోజంతా వీటి సేవే..
రోజూ ఈ 53 శునకాలకు స్నానపానాదులు చేయించడం, ఆహారాన్ని అందించడంలో భార్య, కుమార్తె పాలుపంచుకుంటున్నారు. వారి దినచర్య పూర్తిగా వీటితో గడిచిపోతోంది. ఏరోజూ వీటిని విడిచి ఉండలేదు..ఉండలేం కూడా అంటుంది ఆయన కుమార్తె ప్రియ. కేవలం వాటికి భోజనం పెట్టడమే కాదు అంటు వ్యాధులు రాకుండా  ముందస్తు వ్యాక్సిన్లు వేయిస్తున్నారు. ఇటీవలే ఒక శునకానికి చెవి వ్యాధి సోకితే చెన్నై తీసుకెళ్లి నయం చేయించారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు వారు ఎలా వాటిని సాకుతున్నారో తెలుసుకోడానికి.

మూలికా వైద్యనిపుణలు..
ఏసుపాదం బాబుకు మూలికా వైద్యంపై మంచి పట్టు ఉంది. ఈ వైద్యాన్ని కూడా ఆయన వాణిజ్య దృక్పథం లేకుండానే అందిస్తున్నారు. జీవనశైలి మార్చుకోవడం ద్వారానే రోగాలను నయం చేసుకోవచ్చునని చెబుతారీయన. తనదగ్గర కొచ్చే రోగులకు ఈ మార్గం ద్వారానే స్వçస్థత చేకూర్చుతున్నారు. రెండు కిడ్నీలకు తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ సోకిన ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసరు ఇప్పుడు మామూలు మనిషయ్యారు. పూర్తిగా రోగం నయమైంది. ఫెయిత్‌  పవర్‌  పేరున పెయిన్‌ రిలీవర్‌ ఎక్స్‌టర్నల్‌ తైలం, గర్భధారణలో స్పెర్మ్‌ కౌంటింగ్‌ పెరగడానికైన వాల్యూం పౌడర్, చర్మవ్యాధులు నివారించ గలిగే (38 మూలికలతో తయారు చేసిన) పౌడర్, కరివేపాకు, నువ్వులు, సాంబార్, పప్పుల పొడులను తయారు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఖాదీ భాండార్‌లో విక్రయిస్తారు.  రోజు ఎనిమిదివందల రూపాయల వరకు శునకాల పోషణకు వెచ్చించడం వారి ఉదారత్వానికి నిదర్శనం.

చెన్నై టు రాజుల కండ్రిగ
ఇంతకీ ఏసుపాదం బాబుకు ఈ జంతుప్రేమ ఎలా వచ్చిందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. మేం చాలా క్రితం చెన్నైనగరంలో ఉండేవాళ్లం. మొదట్లో ఒకటే భైరవుడు (శునకం) ఉండేవాడు. అది పిల్లలను పెట్టడంతో సంఖ్య నాలుగైంది. వాటి శబ్దాలకు చాలామంది అటుగా వచ్చేవారు కాదు. దీంతో ఇంటి యజమాని ఒప్పుకోలేదు. ఇల్లు ఖాళీ చేయాల్సిందేనన్నారు. ఏం చేస్తాం..ప్రేమాభిమానంతో పెంచుకున్న భైరవులను విడిచిపెట్టడానికి మనసు అంగీకరించలేదు. దీంతో ఉద్యోగం మానుకున్నాను. వాటిని తీసుకుని  ఊతుకోట తాలూకా బాలిరెడ్డి కండ్రిగకు మకాం మార్చాను. రాన్రానూ భైరవుల సంఖ్య పెరిగింది. అక్కడ ఉండడం కూడా ఇబ్బంది అయ్యింది. ఏదో ఒకటో చేయాలి. మనుషుల మధ్య ఉండాలంటే ఇవి దగ్గర ఉండకూడదు. కానీ మనసొప్పుకోలేదు. అందుకే మనుషులకు దూరంగా వచ్చేయాలనుకున్నాను. నాగలాపురం మండలం రాజులకండ్రిగకు కొంచెం దూరంలో  భైరవులకు సౌకర్యార్థంగా ఉండేలా చిన్న ఇల్లు కట్టుకున్నాం. ఇరుకుగానే ఉంది. కానీ ఇల్లు చిన్నదని పిల్లలను వదిలేయలేం కదా..అందుకే కష్టమో నష్టమో వాటితో కలిసే ఈ ఇంటిలో జీవిస్తున్నామని ఏసుపాదంబాబు వివరించారు. ఇప్పుడు వారిల్లే భైరవాశ్రమంగా మారిపోయింది.

వైద్యులు చేతులెత్తేసిన వారికి వైద్యం
మొండిరోగాలని చేతులెత్తేసిన పరిస్థితుల్లోనూ ఏసుపాదం స్పందించి వైద్యం చేస్తున్నారు. ఆయుర్వేద, సిద్ధ్ద విధానాల్లో ప్రకృతి చికిత్స మార్గాలతో నయం చేస్తున్నారని ఇక్కడికొచ్చే రోగులు చెబుతున్నారు. ఇప్పుడున్న జీవన విధానాలే సర్వరోగాలకు కారణమని..వాటిలో మార్పు తెచ్చుకోవాల్సిన అవసరముందని సూచిస్తారీయన. పెద్ద పెద్ద రోగాలకూ ఇందులోనే మందు ఉందంటారు. . క్యాన్సర్‌ రోగులనూ ఆరోగ్యవంతులుగా మార్చవచ్చంటారీయన.∙తాత, ముత్తాతల నుంచి వంశపారపర్యంగా వస్తున్న  మూలికా వైద్యాన్ని ఉచితంగా అందించడం విధిగా పెట్టుకున్నారు. ఈ వైద్యుని ఇంట్లో అన్నీ  మట్టి పాత్రలనే వాడటం విశేషం. అల్యూమినియం పాత్రలు, కుక్కర్లు, నాన్‌స్టిక్‌ తవ్వాల వాడకం శ్రేయస్కరం కాదంటారు. ధ్యానం, యోగా   చేస్తూ అందరితో చేయిస్తుంటారు.

క్రమశిక్షణకు మారుపేరు..
భైరవాశ్రమంలో శునకాలు పూర్తిగా శాఖాహారులు. వీటికి ఆ రకమైన తర్ఫీదునిచ్చారు. ఇక్కడ వీధి కుక్కలే కాదు  వివిధ జాతులకు చెందినవి కూడా ఉన్నాయి.  ప్రకృతిసిద్ధంగా లభించే గడ్డి రకాలు, గడ్డిపూలు, ఆకుకూరలు, దుంపలు, క్యారెట్టు, బీటు, నూల్‌కోల్, చౌచౌ, ఉల్లిగడ్డలు, టమాట, అటుకులు, బొరుగులు, బిస్కట్లను ఆహారంగా తీసుకుంటూ ఈ శునకాలన్నీ ఆరోగ్యకరంగా ఉన్నాయి. అంతేకాదు క్రమ శిక్షణను పాటిస్తాయి.  ఆహారం తీసుకున్న సమయంలో పోట్లాడుకోవు. తన వంతు వచ్చే వరకు ఎదురుచూస్తాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా