ఎన్నికల వాయిదాపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

17 Mar, 2020 19:13 IST|Sakshi

ఢిల్లీ :  ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే ఆధ్వర్యంలో విచారణ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను అర్ధాంతరంగా వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) ఈనెల 15న జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉదయం సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన అనంతరమే ఎన్నికలు వాయిదా వేయాలని కిషన్‌ సింగ్‌ తోమర్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వ్యవహరించిందని పిటిషన్‌లో పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 ఇ, 243 యు నిర్దేశించిన ప్రకారం స్థానిక సంస్థల కాలపరిమితి ముగిసినందున ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని, ప్రతివాది దీన్ని గౌరవించలేదని నివేదించింది. మార్చి 31లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పూర్తికాని పక్షంలో 14వ ఆర్థిక సంఘం నిధులకు కాలం చెల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రోజువారీ పాలనతోపాటు కోవిడ్‌–19 వ్యాప్తిని నిరోధించడంలో స్థానిక సంస్థల పాత్ర అత్యంత కీలకమని పిటిషన్‌లో తెలిపింది. హై కోర్టు ఆదేశం మేరకు జరుగుతున్న ఎన్నికలను వారిని సంప్రదించకుండా ఆపడం తగదని పిటిషన్‌లో పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులును నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరింది.

మరిన్ని వార్తలు