డీజిల్‌ కొడితే అన్నీ నీళ్లే

18 Oct, 2017 11:17 IST|Sakshi
డీజిల్‌ను పరిశీస్తున్న తహసీల్దార్‌ విమలకుమారి, తూనికల కొలతల జిల్లా అధికారి భానుప్రసాద్‌

వినియోగదారుల ఆందోళన

బంకును సీజ్‌ చేసిన అధికారులు

మోపిదేవి(అవనిగడ్డ): స్థానిక శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఫిల్లింగ్‌ స్టేషన్‌(పెట్రోలుబంక్‌)లో డీజిల్‌ కొట్టించుకుంటే నీళ్లు వచ్చాయని పేర్కొంటూ పలువురు వినియోగదారులు మంగళవారం బంక్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఉదయం పలు మినీ వాహనాల్లో డ్రైవర్‌లు డీజిల్‌ కొట్టించుకోగా కొద్ది దూరం వెళ్లి వాహనాలు ఆగిపోయాయి. దీంతో వారు తిరిగి బంక్‌ వద్దకు వచ్చి, సీసాల్లో డీజిల్‌ కొట్టించగా, అందులో నీరు కనిపించింది. దీంతో సిబ్బందిని నిలదీశారు. బాధితులకు వైఎస్సార్‌ సీపీ నాయకులు అండగా నిలవడంతో ఆందోళన బాటపట్టారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. డీజిల్‌లో నిరు కలవడం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయని, బంక్‌ను మూసివేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేశారు.

ఈ ఆందోళన విషయం ఆర్డీఓ దృష్టికి వెళ్లడంతో స్థానిక తహసీల్దార్‌ విమలకుమారి ఘటనాస్థలానికి చేరుకుని తూనికలు, కొలతల జిల్లా అధికారి భానుప్రసాద్‌తో కలిసి డీజిల్, పెట్రోలును పరిశీలించారు. అనంతరం భానుప్రసాద్‌ మాట్లాడుతూ 4 మిల్లీలీటర్లు ఉండాల్సిన వాటర్‌డెన్సీటీ 11 మిల్లీలీటర్లు ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించామన్నారు. మధ్యాహ్నానికి ఇక్కడకు చేరుకున్న హెచ్‌పీ సేల్స్‌ అధికారి శ్రీనివాస్‌ మాట్లాడుతూ సీపీఎస్‌ ట్యాంక్‌లోకి నీరు చేరడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధికారులు తర్జనభర్జనలు పడిన అనంతరం బంక్‌ను సీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. బంక్‌ను సీజ్‌చేసి రిపోర్టును ఉన్నతాధికారులకు పంపుతామని రెవెన్యూ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు