పెట్రోల్‌ బంక్‌లో నిలువు దోపిడీ

23 Feb, 2019 08:42 IST|Sakshi
వినియోగదారునితో వాగ్వాదం చేస్తున్న బంక్‌ యజమాని వినియోగదారుడి బిల్లులో చూపిస్తున్న వ్యత్యాసం

మీటర్‌ రీడింగ్‌లో వ్యత్యాసం

నిలదీసిన వినియోగదారుడిపై యజమాని ఆగ్రహం

శ్రీకాకుళం, ఆమదాలవలస: పట్టణంలోని లక్ష్మణరాజు ఫిల్లింగ్‌ స్టేషన్‌ పెంట్రోల్‌ బంక్‌లో వినియోగదారులను దోపిడీ చేసుకుంటున్న వైనం శుక్రవారం బట్టబయలైంది. మండలంలోని కనుగులవలస గ్రామానికి చెందిన  వినియోగదారుడు తన వాహనానికి రూ. 300 పెట్రోల్‌ పోయించగా, రూ. 290కు రాగానే మీటర్‌ రీడింగ్‌ ఆగిపోయింది. సదరు వినియోగదారుడు ఈ మోసాన్ని గుర్తించి నిలదీశా డు. లీటర్‌ బాటిల్‌లో ఆయిల్‌ కొట్టి పాయింట్లు లెక్క చూపించాలని మొండికేశాడు. ఇంతలో బంకు యజమాని వచ్చి అతడ్ని బుజ్జగించేందుకు నానా ప్రయత్నాలు చేశాడు. అయితే బిల్లు తీసి ఇవ్వాలని పట్టుబట్టగా, అందులోనూ తేడా కనిపించింది.

ఈ లోగా వినియోగదారుల సంఖ్య పెరగడంతో కలవరం చెందిన బంకు యజమాని సదరు వినియోగదారుడిపై విరుచుకు పడ్డాడు. ‘నీలాంటి వారందరికీ సమాధానం చెప్పాలంటే మేం వ్యాపారం చేయలేం. మాకు ఉండాల్సిన అండదండలు ఉన్నాయి. నీవు ఎక్కడి కెళ్తావో, ఏమి చేసుకుంటావో.. నీ ఇష్టం’ అని దురుసుగా ప్రవర్తించాడు. అయితే పంపింగ్‌ యంత్రం మరమ్మతు ఉందని మభ్యపెట్టే ప్రయత్నం చేయగా, వినియోగదారులు విస్మయం వ్యక్తం చేశారు. ఏదేమైనా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విని యోగదారులు నిలువునా మోసపోతున్నామని ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు