ఇంధనం మంటలు...!

3 Sep, 2018 08:13 IST|Sakshi

మరోమారు ఇం‘ధనం’ ధరల మంటలు చెలరేగాయి. గత నవంబర్‌లో  లీటర్‌ పెట్రోల్‌ రూ 74, డీజిల్‌ రూ 65.01 ఉండేది. ఇప్పుడు పెట్రోల్‌ రూ 84.52, డీజిల్‌ రూ 77.59 ఉంది. రుపాయి పతనం కారణంగా ధరలు పెరిగాయని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. ఇప్పుడంటే రూపాయి దిగజారి పోయిందే అనుకుందాం. ఇన్నాళ్లుగా రూపాయి బిళ్ల ఏమైనా ఎగిరి గంతులు వేసిందా.. అని సామాన్యులు మండిపడుతున్నారు. ఏది పెరిగినా..తరిగినా తిప్పలు మాకే కదా...! అని వాపోతున్నారు.

కడప రూరల్‌: జిల్లా వ్యాప్తంగా హిందుస్థాన్‌ పెట్రోలియం లిమిటెడ్, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్, రిలయన్స్‌. ఎస్సార్‌ ఆధ్వర్యంలో 300 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి.  రోజుకు పెట్రోల్‌ దాదాపు 5 లక్షల లీటర్లు, 15 లక్షల లీటర్ల డీజిల్‌ వినియాగం అవుతోంది.

లీటర్‌ పెట్రోల్‌పై రూ 9.84, డీజిల్‌పై రూ 11.97 పెరుగుదల..
పండుగల సమయంలో నిత్యావసర వస్తువుల ధరలను నిర్ణయించే చమురు ధరల పెరుగుదల పరంపర తీవ్రతరమైంది. కేంద్ర ప్రభుత్వం చాప కింద నీరులా ప్రతి రోజు పైసలు..రూపాయి చొప్పున పెంచుకుంటూపోతోంది. ఈ ధరలను ఒకసారి పరిశీలిస్తే గుండె జారిపోతుంది. గడిచిన జనవరి 2వ తేదీన (కడపలో) ఒక లీటర్‌ పెట్రోల్‌ రూ 75,32  డీజిల్‌ రూ 66.38 ఉండేది. ఇప్పుడు (ఆదివారం)  లీటర్‌ పెట్రోల్‌ రూ. 84,52, డీజిల్‌ రూ. 77.59 ఉంది. స్పీడ్‌ పెట్రోల్‌ అయితే అదనంగా రూ 4 వరకు ఉంటుంది. ఇప్పటి వరకు ప్రతి నెలా 2వ తేదీ నాటికి పెరిగిన ధరలను గమనిస్తే గడిచిన 8 నెలల కాలంలో  లీటర్‌ పెట్రోల్‌పై రూ 9.84, డీజిల్‌పై 11.97 పెరిగింది.  కర్ణాటకలో ఎన్నికలకు ముందు   లీటర్‌ పెట్రోల్‌ రూ 78.05 డీజిల్‌ రూ 68.02 ఉండేది. ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం రోజుకు దాదాపుగా ఒక రూపాయి చొప్పున ధరను పెంచుకుంటూ పోయింది.
 
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ వ్యాట్‌ వాత..
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా  రాష్ట్ర ప్రభుత్వం ఏపీ వ్యాట్‌ను విధించింది. దీంతో లీటర్‌పై (పెరిగిన ధరలోనే) రూ 4.50 అదనపు భారం పడుతోంది. ఇది  డీలర్లతో పాటు వినియోగదారులకు అదనపు భారంగా మారింది. ఫలితంగా వాహదారులు డీజిల్‌ను ఇతర రాష్ట్రాల్లో పట్టించుకుంటున్నారు. దీంతో బంకులు నడుస్తున్నాయని, వాటిని మూత వేసే పరిస్ధితి ఏర్పడిందని డీలర్లు అంటున్నారు. మరోవైపు ప్రతి రోజూ పెరుగుతున్న ధరలను చూసి ప్రజలు విస్తుపోతున్నారు.

మరిన్ని వార్తలు