ఆన్‌లైన్‌లో పీఎఫ్ ఖాతాల వివరాలు

30 Aug, 2013 02:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఇకనుంచి ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాల వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకునే వెసులుబాటు కల్పించినట్లు హైదరాబాద్ ఈపీఎఫ్ కమిషనర్ పి.రాజశేఖరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. www.epfindia.com వెబ్‌సైట్‌లో ఈ వివరాలు లభిస్తాయన్నారు. ఈ సైట్లోని ఎస్టాబ్లిష్‌మెంట్ సెర్చ్ లో ఉద్యోగుల వివరాలు కూడా లభ్యమౌతాయన్నారు.
 
 నెలవారీగా ప్రతి ఉద్యోగి, యాజమాన్యాలు పీఎఫ్ ఖాతాల్లో జమచేసిన మొత్తాలు, పాస్‌బుక్‌లను ఈ సైట్లో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ బకాయిలను ఆయా సంస్థల యజమానులు గడువులోగా చెల్లించాలని ఆయన స్పష్టంచేశారు. 1952 పీఎఫ్ చట్టం ప్రకారం ఉద్యోగుల వేతనం నుంచి కట్ చేసిన మొత్తం, యాజమాన్యం చెల్లించాల్సిన మొత్తాన్ని కలిపి నిర్ణీత గడువులోగా జమ చేయాల్సిన బాధ్యత సంబంధిత యాజమాన్యాలదేనన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు, ట్రేడ్‌యూనియన్లు, ఉద్యోగులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని కోరారు.
 

మరిన్ని వార్తలు