అర్హత మేరకే కాలేజీలకు పీజీ అడ్మిషన్లు

26 Jun, 2015 01:35 IST|Sakshi
అర్హత మేరకే కాలేజీలకు పీజీ అడ్మిషన్లు

వచ్చే ఏడాది నుంచి ఇంజనీరింగ్ ప్రవేశాలకూ ఇదే విధానం
కాలేజీల పరిస్థితిపై పరిశీలనకు ఏపీ మంత్రి గంటా ఆదేశాలు

 
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పక్కాగా చేపట్టాలని, అడ్డగోలు కాలేజీలను నియంత్రించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దీనిపై సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ జీవీఆర్ ప్రసాదరాజు ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు. వర్సిటీ ప్రతినిధులతో ఏర్పాటుచేసిన ఫ్యాక్టుఫైండింగ్ కమిటీలు (ఎఫ్‌ఎఫ్‌సీ) ఆయా కాలేజీల్లోని ఏర్పాట్లను పరిశీలించి ఇదివరకు ఇచ్చిన నివేదికలను పరిశీలించేందుకు కమిటీని నియమించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి, సాంకేతిక విద్యాశాఖ మాజీ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంలను ఈ కమిటీలో సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ కాలేజీల స్థితిగతులపై ఎఫ్‌ఎఫ్‌సీలు అందించిన నివేదికలను కొంతమేర పరిశీలించాయి. ఆయా కాలేజీల్లో సదుపాయాలను పరిశీలించి అర్హత మేరకు కాలేజీలకు సీట్లను కేటాయించాలి. సదుపాయాలు లేకుంటే వాటిని కౌన్సెలింగ్  నుంచి మినహాయించాలి. ఈ కమిటీ పరిశీలన పూర్తికాకముందే ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారం భమవడం, శుక్రవారంతో సీట్లు కేటాయించనుండటంతో ఈ ఏడాదికి ఇంజనీరింగ్ యూజీ కోర్సులను పాతజాబితా మేరకే కొనసాగించాలని నిర్ణయించారు.
 
 పీజీ కోర్సుల ప్రవేశాలను పక్కాగా చేపట్టాలని మంత్రి గంటా అధికారులను ఆదేశించారు. ఎఫ్‌ఎఫ్‌సీ నివేదికలకు, అంతకు ముందు ఏపీ ఫీజులు, ప్రవేశాల నియంత్రణ మండలి (ఏఎఫ్‌ఆర్సీ) ఇచ్చిన నివేదికలకు చాలా తేడాలున్నాయని కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. దీంతో కాలేజీలన్నిటిపైనా క్షుణ్ణంగా క్షేత్రస్థాయి తనిఖీలు చేయించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను మంత్రి ఆదేశించారు. ముందుగా పీజీ కాలేజీల్లో ఈ పరిశీలనను చేపట్టించాలని, దాన్ని బట్టి కాలేజీలకు సీట్ల సంఖ్యను నిర్దేశించి అడ్మిషన్లు ఇవ్వాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంటు నిధుల కోసమే ఎక్కువ కాలేజీలు సీట్ల సంఖ్యను పెంచుకొంటున్నాయని రిపోర్టులు వచ్చిన నేపథ్యంలో కాలేజీలన్నిటినీ తనిఖీ చేశాకే అడ్మిషన్లను చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అసిస్టెంటు ప్రొఫెసర్లకు ఎంటెక్, అసోసియేట్ ప్రొఫెసర్లకు, ప్రొఫెసర్లకు పీహెచ్‌డీ తప్పనిసరి చేయాలని నిర్ణయించారు. అధ్యాపకుల ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు పరిశీలన చేపట్టాలని నిర్దేశించారు.

>
మరిన్ని వార్తలు