వణికిస్తున్న ఫైలిన్: జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం

11 Oct, 2013 03:09 IST|Sakshi
సాక్షి/న్యూస్‌లైన్, ఏలూరు : ఫైలిన్ తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం 8.30 గం టల సమయూనికే జిల్లాలో 32.4 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. రోడ్లు జలమయయ్యాయి. కోతకు వచ్చిన వరిచేలు నేలకొరిగాయి. జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ యంత్రాంగానికి తగిన సూచనలు ఇస్తున్నారు. నష్టనివారణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై వివిధ శాఖల అధికారులు, ప్రత్యేక అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. తుపాను ప్రభావిత మండలాల్లో ప్రత్యేకాధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెట్ట, డెల్టా ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీకిస్తూ అవసర మైన ముందస్తు చర్యలు తీసుకునే విషయంలో నీటిపారుదల శాఖ అధికారులు చురుకైన పాత్ర పోషించాలని ఎస్‌ఈ వైఎస్ సుధాకర్‌ను కలెక్టర్ ఆదేశించారు.
 
 బలహీనంగా ఉన్న చెరువు గట్లను పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల ఇసుక బస్తాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. దొంగరావిపాలెం, సిద్ధాంతం ఏటిగట్లు, రాజులంక, నక్కల డ్రెయిన్, నందమూరు ఆక్విడెక్టు, కడెమ్మ స్లూయిజ్, కాజ డ్రెయిన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. జాతీయ విపత్తుల నివారణ సంస్థకు చెందిన 40 మంది బృందాన్ని జిల్లాకు రప్పిస్తున్నామని, వీరిలో సగం మందిని నరసాపురం, మరో సగం మందిని పోలవరం ప్రాంతానికి పంపుతామని కలెక్టర్ చెప్పారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ టీవీ సూర్యప్రకాష్‌కు ఆదేశాలిచ్చారు. కూలిపోయే అవకాశం ఉన్న చెట్లను ముందుగానే తొలగించాలని ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. 
 
 ముంపు ప్రాంతాల్లోని నీటిని తొలగించేందుకు ఫైర్ ఇంజిన్లు, మోటార్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. రెండు, మూడు రోజుల్లో కాన్పు అయ్యే అవకాశం ఉన్న గర్భిణులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట్ల వెంటనే వైద్యం అందించేందుకు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, అంగన్ వాడీ కేంద్రాల్లో బియ్యం, పప్పు దినుసుల నిల్వలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలని, లోత ట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు బోట్లను, గజ ఈతగాళ్లను సిద్ధం చేయూలన్నారు. 
 
 భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో కళ్లాలపై ఉన్న పంటను కాపాడేందుకు వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పొగాకు నర్సరీలకు నష్టం వాటిల్లకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు రాజమండ్రిలోని సీటీఆర్‌ఐ అధికారులతో సంప్రదింపులు జరపాలని వ్యవసాయ శాఖ జేడీ కృపాదాస్‌ను ఆదేశించారు. సమావేశంలో జేసీ టి.బాబూరావునాయుడు, డీఆర్వో ఎం.ప్రభాకరరావు, ఆర్డీవోలు శ్రీనివాస్, గోవిందు, నాన్‌రాజు, జె.వసంతరావు, వివిధ శాఖల ఎస్‌ఈలు సూర్యప్రకాష్, పి.శ్రీమన్నారాయణ, బి.రమణ, జెడ్పీ సీఈవో వి.నాగార్జున సాగర్ పాల్గొన్నారు.
 
 వ్యవసాయ, విద్యుత్ శాఖలు అప్రమత్తం
 తుపాను నేపథ్యంలో వ్యవసాయశాఖ అప్రమత్తమైంది. వ్యవసాయ అధికారులంతా రైతులకు అందుబాటులో ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పంటల్ని కాపాడుకునే విషయంలో వారికి తగిన సూచనలు ఇవ్వాలని  ఆ శాఖ సంయుక్త సంచాలకులు కృపాదాస్ ఆదేశించారు. తుపాను నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యూరు. సమ్మెను తాత్కాలికంగా విరమించి పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. 
 
 కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
 ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : తుపాను నేపథ్యంలో జిల్లాలోని అన్ని డివిజన్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ సిద్ధార్థజైన్ తెలిపారు. ప్రజ లు విలువైన వస్తువులను ప్లాస్టిక్  కాగితం లో సురక్షిత ప్రాంతాల్లో భద్రపర్చుకోవాలని సూచించారు. విత్తనం, ఎరువు లు, ధాన్యం బస్తాలు, ఎండు చేపలు వంటి వాటిని ఎత్తై అటకలపై ఉంచాలని, పడవలు, వలలు, మగ్గాలు, పంపుసెట్లు వంటివి పాడవకుండా జాగ్రత్త వహించాలన్నారు. పశువులను మెట్ట ప్రాంతాలకు తరలించి, తగినంత మేత ఉండేలా చూడాలన్నారు. 
 
 కంట్రోల్ రూమ్ నంబర్లు
 కలెక్టరేట్ - 08812-230617
 ఆర్డీవో- ఏలూరు- 08812-232044
 ఆర్డీవో- నరసాపురం- 08812-276699
 ఆర్డీవో- కొవ్వూరు- 08813-231488
 ఆర్డీవో- జంగారెడ్డిగూడెం- 08821-223660
 
ప్రత్యేక అధికారుల నియూమకం
ఏలూరు, న్యూస్‌లైన్ : తుపాను ప్రభావిత మండలాలకు జిల్లాస్థారుు అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆచంటకు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సలీంఖాన్ (77020 03552), ఆకివీడుకు ఎస్‌ఈ కార్పొరేషన్ ఈడీ ఎన్‌వీవీ సత్యనారాయణ  (80083 01168), యలమంచిలికి డ్వామా పీడీ ఎన్.రామచంద్రరెడ్డి (98665 52678), కొవ్వూరుకు జె డ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్ (94937 42399), మొగల్తూరుకు డీఆర్‌డీఏ పీడీ వై.రామకృష్ణ (97049 79777), నరసాపురానికి డీఈవో నరసింహరావు  (98499 09105), పోడూరుకు గృహ నిర్మాణ సంస్థ పీడీ జి.సత్యనారాయణ (77997 21148), పోలవరానికి కేఆర్‌పురం గిరిజన సంక్షేమ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ ఝాన్సీరాణి (94406 64161), భీమవరం మండలానికి పశుసంవర్థక శాఖ జేడీ కె.జ్ఞానేశ్వరావు (99899 32844) నియమించారు.
 
మరిన్ని వార్తలు