వారికి వేళా పాళా లేదు!

13 Feb, 2020 13:11 IST|Sakshi
కేంద్రాస్పత్రిలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌ పరికరం

సమయ పాలన పాటించని పీహెచ్‌సీల్లో ఉద్యోగులు

చాలా చోట్ల పనిచేయని బయోమెట్రిక్‌ యంత్రాలు

38 చోట్ల పనిచేస్తున్నా... ఎప్పుడు ఆస్పత్రికి వస్తే అప్పుడే హాజరు

చికిత్స కోసం వచ్చే రోగులకు తప్పని అవస్థలు

పట్టించుకోని జిల్లా అధికారులు

విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ సమయపాలన కచ్చితంగా అమలవుతున్నా... పీహెచ్‌సీల్లో మాత్రం అమలు కావడం లేదన్నది సుస్పష్టం. వైద్యుల నుంచి ఉద్యోగుల వరకూ అంతా కచ్చితంగా బయోమెట్రిక్‌ హాజరు వేయాల్సిందేనని నిర్ణయిస్తూ ఆయా కార్యాలయాల్లో పరికరాలు ఏర్పాటు చేసినా కొన్ని పీహెచ్‌సీల్లో అవి మూలకు చేరాయి. దీనిని అవకాశంగా తీసుకుంటున్న ఉద్యోగులు, వైద్యులు ఇష్టానుసారం వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక బయోమెట్రిక్‌ పరికరాలు పనిచేస్తున్న చోటయినా వేళకు వస్తున్నారా... అంటే అదీ లేదు. వారు ఎప్పుడు వస్తే అప్పుడే బయోమెట్రిక్‌ వేసి మమ అనిపిస్తున్నారు. 

పనిచేస్తున్నవి 38 మాత్రమే...
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 68 పీహెచ్‌సీలు, వైద్య విధాన పరిషత్‌ పరిధిలో 11 సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. జిల్లాలో 68 పీహెచ్‌సీలలో పరికరాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం 38 పీహెచ్‌సీల్లో మాత్రమే పనిచేస్తున్నాయి. 30 ఆస్పత్రుల్లో పరికరాలు పనిచేయడం లేదు. వైద్య విధాన్‌ పరిషత్‌ ఆస్పత్రుల్లో పరికరాలన్నీ పనిచేస్తున్నాయి. కాని విధులకు ఎప్పుడు హాజరు అయితే అప్పుడే బయోమెట్రిక్‌ వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం 9 గంటలకు బమోమెట్రిక్‌ వేయాలి. కాని 10 గంటలకు, 10.30 గంటలకు, 11 గంటలకు కూడా వేస్తున్నా అడిగే నాథుడే కరువయ్యాడన్న విమర్శలున్నాయి. వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోవడం వల్ల రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు. పీహెచ్‌సీల్లో రోగులు పలు ఇబ్బందులు పడుతున్నారు.

నిబంధనలు కఠినంగా లేకే...
బయోమెట్రిక్‌ అధారంగా జీతాలు ఇస్తామని అప్పట్లో వైద్య శాఖ ఉన్నత అధికారులు ప్రకటించారు. బయోమెట్రిక్‌ హాజరు అధారంగా జీతాలు ఇచ్చినట్టయితే ఆలస్యంగా వచ్చేవారికి కచ్చితంగా వేతనంలో కోత పడుతుంది. ఈ ఉద్దేశం ఇప్పుడు నెరవేరకపోవడంతో పరికరాలు ఉన్నా... ప్రయోజనం లేకపోతోంది.

పరికరాలు బాగు చేయిస్తాం
68 పీహెచ్‌సీలకు 38 చోట్ల బయోమెట్రిక్‌ పరికరాలు పనిచేస్తున్నాయి. 30 పీహెచ్‌సీల్లో పనిచేయడం లేదు. వీటిని బాగు చేయించడానికి ఇచ్చాం. పాతవి తరచూ మొరాయిస్తుండడంతో వాటి స్థానంలో కొత్తవి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. వైద్య సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు తీసుకుంటాం.   ఎస్‌.వి.రమణకుమారి, డీఎంహెచ్‌ఓ

మరిన్ని వార్తలు