పేద రోగులంటే నిర్లక్ష్యమా?

17 Jun, 2019 11:38 IST|Sakshi
బలిజిపేట పీహెచ్‌సీ వద్ద కుటుంబ సభ్యులతో నిరీక్షిస్తున్న భవాని

సాక్షి, బలిజిపేట (విజయనగరం): వైద్యసేవల నిమిత్తం స్థానిక పీహెచ్‌సీకి వచ్చే రోగులంటే సిబ్బందికి లెక్కలేకుండా పోతోందని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పీహెచ్‌సీకి ఎక్కువగా నిరుపేదలే వస్తుంటారు. అయితే వీరిపట్ల వైద్యసిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. బలిజిపేట గొల్లవీధికి చెందిన బూర్ల భవాని శని వారం మధ్యాహ్నం కుక్కకాటుకు గురైంది. చికిత్స నిమిత్తం బలిజిపేట పీహెచ్‌సీకి రాగా కుక్కకాటు ఇంజక్షన్‌ లేదని చెప్పి టీటీ ఇంజక్షన్‌ చేసి పంపించేశారు.

శనివారం అర్ధరాత్రి అదే గొల్లవీధికి చెందిన ఎన్‌ లక్ష్మణకు అదేకుక్క కాటు వేయగా స్థానికులు వెంటనే పీహెచ్‌సీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న వైద్య సిబ్బంది ఆయనకు కుక్కకాటు ఇంజక్షన్‌ చేసి అవసరమైన చికిత్స చేశారు. మధ్యాహ్నం ఇంజక్షన్‌ లేదన్నారు కదా? ఇప్పుడు ఎలా వచ్చిందని వారు ప్రశ్నించగా, ఇప్పుడే దొరికిందని సిబ్బంది సమాదానం చెప్పారు. కాగా ఆదివారం ఉదయం భవాని మళ్లీ పీహెచ్‌సీకి ఇంజెక్షన్‌ కోసం వెళ్లింది. ‘ఇంజక్షన్‌ లేదని చెప్పాం కదా మళ్లీ ఎందుకు వచ్చావు’ అంటూ వైద్య సిబ్బంది రుసరుసలాడారు.

శనివారం రాత్రి కుక్కకాటుకు గురైన లక్ష్మణరావు ఆస్పత్రికి వచ్చినపుడు ఇంజక్షన్‌ చేశారు కదా, ఇప్పడు లేదని ఎందువల్ల బుకాయిస్తున్నారని బాధితురాలు నిలదీయగా ‘ఆ విషయం డాక్టర్‌ను అడుగు’ అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాదానం చెప్పడంపై బాధితురాలు భవాని, ఆమె బంధువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం లేని ఇంజక్షన్‌ రాత్రి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. పేదరోగులపై వైద్య సిబ్బంది ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎంతవరకు న్యాయమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై వైద్యాధికారి మహీపాల్‌ను వివరణ కోరగా సోమవారం వరకు తాను సెలవులో ఉన్నానని వచ్చిన తర్వాత వివరాలు తెలుసుకుని తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు.

మరిన్ని వార్తలు