ఎస్వీయూలో ఇక పీహెచ్‌డీ ఈజీ కాదు

16 Apr, 2019 10:50 IST|Sakshi

మళ్లీ ఫారిన్‌ ఎగ్జామినర్‌

కొత్తగా మూడు సెమినార్లు

ప్రీ–పీహెచ్‌డీ అర్హత మార్కుల పెంపు

ఎస్వీయూ యూఆర్‌సీలో నిర్ణయం

2019 నూతన నిబంధనలు     అమల్లోకి..

చిత్తూరు, యూనివర్సిటీ క్యాంపస్‌: ఎస్వీ యూనివర్సిటీలో ఇకపై పీహెచ్‌డీ డిగ్రీ పొందటం అంత తేలిక కాదు. ఇకపై పరిశోధక విద్యార్థులు సమర్పించే సిద్ధాంత గ్రంథాన్ని  మూల్యాంకనం కోసం విదేశీ యూనివర్సిటీలకు పంపనున్నారు. అలాగే ప్రీ–పీహెచ్‌డీ పాసు మార్కులు 50 నుంచి 55 శాతానికి పెంచారు. ఎస్వీయూలో ఇకపై  అడ్మిషన్‌ పొందే విద్యార్థులకు ఈ నూతన నియమావళి వర్తించనుంది. 2019 గైడ్‌లైన్స్‌ పేరిట రూపొందించిన ఈ నూతన నియమావళికి యూఆర్‌సీæ ఆమోదం తెలిపింది. ఎస్వీ యూనివర్సిటీ రీసెర్చ్‌ కమిటీ (యూఆర్‌సీ) సమావేశం సోమవారం నిర్వహిం చారు. వీసీ రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో యూనివర్సిటీ రీసెర్చ్‌ గైడ్‌లైన్స్‌–2019కి ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు ఉన్న యూనివర్సిటీ గైడ్‌లైన్స్‌–2016 స్థానంలో ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలన్నీ ఇకపై అడ్మిషన్‌ తీసుకునే వారికి వర్తించనున్నాయి. ఏపీఆర్‌సెట్‌ ద్వారా అర్హత సాధించిన వారికి వెంటనే అడ్మిషన్‌ ఇచ్చి ఈ నిబంధనలు అమలు చేయనున్నారు. ఇప్పటికే అడ్మిషన్‌ పొందిన వారు పాత నిబంధనలకు అనుగుణంగానే తమ పరిశోధనలు చేయవచ్చు.

14 సంవత్సరాల తర్వాత ఫారిన్‌ ఎగ్జామినర్‌
పీహెచ్‌డీ చేస్తున్న పరిశోధక విద్యార్థులు వర్సిటీకి సమర్పించిన సిద్ధాంత గ్రంథం ముగ్గురు అధ్యాపకులకు మూల్యాంకనానికి పంపుతారు. గతంలో ఇక విదేశీ యూనివర్సిటీ అధ్యాపకుడికి, ఇద్దరు మన దేశంలోని యూనివర్సిటీల అధ్యాపకులకు మూల్యాంకనానికి పంపేవారు. దీనివల్ల ఆలస్యమవుతోందని భావించిన మాజీ వీసీ ఎస్‌.జయరామిరెడ్డి 2005లో విదేశీ వర్సిటీల మూల్యాంకనం రద్దు చేశారు. దీనివల్ల పీహెచ్‌డీల మూల్యాంకనం తేలిక అయింది. 14 సంవత్సరాల్లో సుమారు 5 వేల మంది పీహెచ్‌డీ డిగ్రీలు పొందారు. అయితే ఇటీవల కాలంలో పీహెచ్‌డీలలో నాణ్యత తగ్గిందని భావించిన యూజీసీ, ఏపీ ఉన్నతవిద్యామండలి విదేశీ వర్సిటీ మూల్యాం కనం తప్పని చేయాలని వర్సిటీలను ఆదేశిం చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఎస్వీయూలో నిర్వహించిన యూఆర్‌సీలో ఫారిన్‌ యూనివర్సిటీ మూల్యాంకనానికి ఆమోదం తెలిపింది. ఇకపై అడ్మిషన్‌ పొందేవారు వర్సిటీకి సమర్పించే సిద్ధాంత గ్రంథాల్లో ఒకటి విదేశీ వర్సిటీకి, రెండు మన దేశంలో ఇతర యూనివర్సిటీలకు మూల్యాంకనానికి వెళ్లనున్నాయి. 2019 రీసెర్చ్‌ గైడ్‌లైన్స్‌ పేరిట నూతన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ఇకపై పీహెచ్‌డీ అడ్మిషన్‌ పొందేవారంతా ఈ నిబంధనలు పాటించాలి. ఇది వరకే అడ్మిషన్‌ పొందినవారికి ఈ నిబంధనలు వర్తించవు. ఈ నిబంధనల్లో మరికొన్ని ఇలా ఉన్నాయి..

ఇకపై అడ్మిషన్‌ పొందే వారు పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథం సమర్పించే లోపు మూడు సెమినార్లు ఇవ్వాల్సి ఉంది. ఒక్కో సెమినార్‌కు 50 మార్కులు(ఒక్కో సెమినార్‌కు 2 క్రెడిట్స్‌).
ప్రీ పీహెచ్‌డీలో రీసెర్చ్‌మెథడాలజీ 100 మార్కులు(4 క్రెడిట్స్‌), సబంధిత సబ్జెక్ట్‌కు 100 మార్కులు(4 క్రెడిట్స్‌) ఉంటాయి.
ప్రీ పీహెచ్‌డీలో పరిశోధక విద్యార్థుల పాస్‌ మార్కుల శాతాన్ని 50 నుంచి 55కు పెంచారు.
పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథం సమర్పించే లోపు 2 పరిశోధన వ్యాసాలు ప్రచురించాలి.
పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథం సమర్చించే సమయంలో ప్లాగరిథం(కాపీయింగ్‌) టెస్ట్‌ చేయిం చుకోవాలి.
పీహెచ్‌డీ అడ్మిషన్‌ పొందేవారు యూజీసీ నెట్, ఏపీ సెట్, ఏపీ రీసెర్చ్‌ సెట్‌(ఏపీ ఆర్‌సెట్‌)లలో ఏదో ఒక దానిలో తప్పనిసరిగా అర్హత సాధించాలి.
వివిధ పరిశోధన సంస్థల నుంచి ఫెలోషిప్‌లకు ఎంపికైన వారు కూడా పై మూడు ప్రవేశ పరీక్షల్లో ఒకదానిలో అర్హత సాధించాలి.
పీహెచ్‌డీ కోర్సుల్లో ఇకపై ప్రాథమిక(ప్రొవిజనల్‌) అడ్మిషన్‌ ఉండదు.
పీహెచ్‌డీ అడ్మిషన్‌ పొందిన వారు తమ పరిశోధన అంశం(టైటిల్‌) ఖరారు చేసుకునే సమయంలో ఒకటి, ప్రీ పీహెచ్‌డీకి ముందు ఒకటి, సినాప్సిస్‌ సమర్పించేందుకు ముందు ఒకటి సెమినార్‌ ఇవ్వాలి.

త్వరలో అడ్మిషన్లు
ఎస్వీయూ రీసెర్చ్‌ నూతన గైడ్‌లైన్స్‌కు యూఆర్‌సీ అనుమతి రాకపోవడంతో ఏపీఆర్‌సెట్‌–2018లో అర్హత సాధించిన వారికి ఇప్పటివరకు అడ్మిషన్‌ ఇవ్వలేదు. సోమవారం నూతన నియమావళికి అనుమతి లభించిన నేపథ్యంలో ఏపీఆర్‌సెట్‌–2018లో అర్హత సాధించిన 150 మందికి వచ్చే వారంలో అడ్మిషన్‌ ఇవ్వనున్నారు. సోమవారం నిర్వహించిన యూఆర్‌సీ సమావేశంలో రెక్టార్‌ జీ.జానకిరామయ్య, రిజిస్ట్రార్‌ ఆర్కే అనురాధ, రీసెర్చ్‌ డీన్‌ విజయభాస్కర్‌రావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు