విద్యావంతుడి విషాదాంతం

25 Nov, 2013 01:23 IST|Sakshi

మంచాల, న్యూస్‌లైన్:  ‘చదువుకున్నోడు, శాస్త్రవేత్త కావాల్సిన నా బిడ్డ శవమై వచ్చాడు..అయ్యో మాకేంటి ఈ గతి?’ అంటూ వెంకటేష్ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. వారిని ఓదార్చడం బంధువుల తరంకాలేదు. ఆదివారం నగరంలోని సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థి వెంకటేష్ బలవన్మరణంతో స్వగ్రామం మంచాల మండలం లింగంపల్లి శోకసంద్రమైంది. గ్రామానికి చెందిన మాదారి అంజయ్య, వెంకటమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అంజయ్య రిటైర్డ్ ఏఎస్‌ఐ. వెంకటమ్మ గృహిణి. వీరి రెండో కుమారుడు వెంకటేష్(25) చురుకైన విద్యార్థి. ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచే అహర్నిషలు శ్రమించేవాడు.

నగరంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మీడియట్, డిగ్రీ పూర్తి చేశాడు. ఎంబీబీఎస్‌కు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని కొద్ది మార్కుల తేడాతో డాక్టర్ చదవలేకపోయాడు. దీంతో ఆయన జేఎన్‌టీయూలో పీజీ చదివాడు. అనంతరం సెంట్రల్ యూనివర్సిటీలో బయో కెమెస్ట్రీలో పీహెచ్‌డీలో చేరి ప్రస్తుతం రెండో ఏడాది చదువుతున్నాడు. తరచూ తనను గైడ్ రవి వేధిస్తున్నాడని వెంకటేష్ కుటుంబీకులతో చెబుతుండేవాడు. కాగా గ్రామంలో ఆదివారం రాత్రి వెంకటేష్ అంత్యక్రియలు నిర్వహించారు.
 శోకసంద్రమైన లింగంపల్లి..  
 వెంకటేష్ మృతితో కుటుంబీకులు, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఉన్నత లక్ష్యానికి చేరుకుంటాడనుకున్న వెంకటేష్ బలవన్మరణానికి పాల్పడడం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం ఉదయం తనకు జేఎల్(జూనియర్ లెక్చరర్) పరీక్ష ఉందని, సెంటర్ వరకు తీసుకెళ్తానని చెప్పిన తమ్ముడు వెంకటేష్ అంతలోనే విగత జీవి అయ్యాడని అక్క రాణి గుండెలుబాదుకుంది. వెంకటేష్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు