కదంతొక్కిన వికలాంగులు

30 Sep, 2013 23:41 IST|Sakshi

 సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ఇళ్ల స్థలాల కోసం వికలాంగులు కదంతొక్కారు. వికలాంగుల హక్కుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మల్లేశం మాట్లాడుతూ.. ప్రభుత్వం వికలాంగుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వికలాంగులందరికీ ఇళ్ల స్థలాలు, అంత్యోదయ రేషన్ కార్డులు, దీపం కనెక్షన్ కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని, జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. స్వయం ఉపాధి కోసం బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 3 శాతం వికలాంగులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
 
  ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడివయ్య మాట్లాడూతూ.. పారిశ్రామిక వేత్తలకు భూములిస్తున్న ప్రభుత్వం, వికలాంగులకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. జిల్లా స్థాయిలో వికలాంగుల మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని, సర్టిఫికెట్లు కలిగిన వికలాంగులకు పింఛన్లు మంజూరు చేయాలని, ఉపాధి హామీ పథకంలో 150 రోజులపాటు పనులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, కార్యదర్శి గోపాల్, నాయకులు బస్వరాజ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు