ఫోన్‌ వచ్చిందో ఒకటి నొక్కాల్సిందే

6 Nov, 2018 13:33 IST|Sakshi

అర్టీజీఎస్‌ కాల్స్‌తో ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం

సంతృప్తి వ్యక్తం చేస్తే...లేదంటే విసిగింపే

బద్వేలుకు చెందిన సురేష్‌కు ఫోన్‌ వచ్చింది. లిఫ్ట్‌ చేయగానే నేను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మాట్లాడుతున్నానని, ప్రభుత్వ పని తీరు సంతృప్తిగా ఉందా? అంటూ అడిగారు. సంతృప్తిగా ఉంటే ఒకటి, లేకుంటే రెండు నొక్కాలని అన్నారు. సురేష్‌ రెండు నొక్కాడు. అంతే ఎందుకు? ఏమిటి? ఎలా? అంటూ సిబ్బంది విసిగించారు. దీంతో ఎందుకొచ్చిన ఈ తిప్పలంటూ అక్కడి నుంచి ఫోన్‌ వస్తే చాలా ఒకటి నొక్కేస్తున్నారు.పోరుమామిళ్లకు చెందిన చెన్నారెడ్డికి ఫోన్‌ కాల్‌ వచ్చింది. పౌరసరఫరాల శాఖ పనితీరు ఎలా ఉందని ప్రశ్నించారు. సంతృప్తిగా లేదని చెప్పాడు. అంతే పదే పదే ఫోన్‌లు.. ప్రశ్నల మీద ప్రశ్నలు.. చేసేది లేక అంతా బాగుందని చెప్పాడు.

వైఎస్‌ఆర్‌ జిల్లా, బద్వేలు:  ప్రభుత్వం పాలన కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. ఈ క్రమంలో ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆర్టీజీఎస్‌ ద్వారా చేస్తున్న ఫోన్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఫోన్‌ వచ్చిన తర్వాత సంతృప్తిగా ఉన్నామన్న అభిప్రాయం చెబితేగాని వదలడం లేదు. దీనికి నిదర్శనం సురేష్, చెన్నారెడ్డిలకు వచ్చిన ఫోన్‌కాల్సే. జిల్లాలో అనేకమంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రభుత్వాలు పథకాలు అమలు చేయడం, వాటిని అర్హులకు అందేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించడం తెలుసు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రచారం చేసుకునేందుకు ప్రజలకు రియల్‌ టైం గవర్నెన్స్‌ సోసైటీ (ఆర్టీజీఎస్‌) ద్వారా ఫోన్లు చేసి ప్రజలతో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు  వాయిస్‌తో వస్తున్న ఫోన్‌ సంతృప్తిగా ఉన్నారా? ఉంటే 1 నొక్కండని,  లేదంటే 2 నొక్కాలని అడుగుతున్నారు. ఇలా జిల్లాలో రోజూ ప్రభుత్వ పనితీరు, పథకాల అమలుపై వేలాది మందికి ఫోన్లు  వస్తున్నాయి. ఇందులో చాలా మంది ఒకటి నొక్కుతుండటం విశేషం.

రెండు నొక్కితే...
పొరపాటున అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు నొక్కారంటే రోజంతా పని చేయనవసరం లేదు. అక్కడి సిబ్బంది ఎందుకు అసంతృప్తిగా ఉన్నారంటూ అనేక ప్రశ్నలు వేసి విసిగిస్తారు. పైగా కొందరిని  వారికి సంబంధం లేని అంశాలపై కూడా అభిప్రాయాలు కోరుతున్నారు. రేషన్‌కార్డు లేనివారిని, పెన్షన్‌ అందుకొని వారిని ఆయా పథకాలపై అభిప్రాయం కోరుతున్నారు. కొందరు తమకు సంబంధం లేని విషయం కావడంతో ఫోన్‌ కట్‌ చేస్తున్నారు. అయినా మళ్లీ ఫోన్‌ చేస్తుండటంతో అభిప్రాయం చెప్పని పరిస్థితి. రెండు నొక్కితే పదే పదే ఫోన్లు వస్తుండటంతో ఎందుకు వచ్చిన సమస్య అంటూ ఒకటి నొక్కుతున్నారు.  ఈ ఫోన్‌లలో ఆధార్‌కార్డు, ఊరు, పేరు, ఇతర ఇబ్బందికర వివరాలు అడుతుండటంతో ఒకటి బెటర్‌ అనే భావనలో అసంతృప్తిగా ఉన్నా ఒకటి నొక్కక తప్పడం లేదని వాపోతున్నారు. అనేక మంది అధికారుల మధ్య కూడా ఈ చర్చ నడుస్తూనే ఉంది. అయినా ఎవరూ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెల్లడం లేదు. తీసుకెళ్లినా ప్రభుత్వంతో ఎందుకొచ్చిన ఇబ్బంది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రచార్భాటం
ప్రజలకు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి లేకపోయినా, ఇష్టం లేకపోయినా, పథకాలు అందకపోయినా ఫోన్‌కాల్స్‌తో ఇబ్బంది పడటమెందుకని ఒకటి నొక్కుతున్నారు. దీంతో ప్రభుత్వం ఇది తమ ఘనత అంటూ ప్రచారం చేసుకోవడం విమర్శలు వస్తున్నాయి. ఇటివల కాలంతో ముఖ్యమంత్రితో పాటు అనేక మంది అధికార పార్టీ నేతలు తమ ప్రభుత్వంపై 70–80 శాతం సంతృప్తిగా ఉన్నారంటూ చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాన్ని గమనిస్తున్న ప్రజలు మాత్రం నవ్వుకుంటున్నారు. ఇదే సంతృప్తి అనుకుంటే ప్రతిపక్షానికి మంచిదని సెటైర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అర్ధం చేసుకోపోయినా పర్వాలేదు గానీ, ప్రజలను విసిగించకుండా ఉంటే మంచిదని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు