‘శుభాకాంక్షలు’@ రూ.5 కోట్లు!

2 Jan, 2014 04:27 IST|Sakshi
‘హలో.. హ్యాపీ న్యూ ఇయర్..... థ్యాంక్యూ.. సేమ్ టు యు..’ ఫోన్లో.. ఈ రెండు ముక్కల సంభాషణ.. ‘విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్’ అన్న సంక్షిప్త సందేశం.. విలువ ఎంతో తెలుసా.. అక్షరాలా రూ. ఐదు కోట్లు! ఆశ్చర్యంగా ఉంది కదూ.. అయినా నిజం. ఇదంతా.. ఏడాది పొడవునా.. అనుకుంటే.. పొరపాటే.. కేవలం డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1వ తేదీ రాత్రి వరకు వివిధ సెల్‌ఫోన్, ఇతర ఫోన్‌ల సంస్థలకు సమకూరిన ఆదాయం. కొన్ని గంటల వ్యవధిలో  సంబంధిత ఫోన్ సంస్థలకు మామూలు రోజుల కంటే..మూడు రెట్ల ఆదాయం లభించిందని చెప్పడం అతిశయోక్తి కాదు. 
 
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్ :
నూతనవత్సరం ఫోన్ నెట్‌వర్క్ కంపెనీలకు  బంపర్ ఆఫర్ తెచ్చిపెట్టింది.  సాంకేతికత పెరిగిన నేపథ్యంలో గ్రీటింగ్ కార్డులకు స్వస్తి చెప్పి..ఫోన్లో విషెష్ చెప్పడంతో పాటు..మెసేజ్‌లు పంపే విధానం ఊపందుకోవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు..ఆరు కాయల్లా మారింది.  దీంతో గడచిన ఒక్కరోజే వివిధ సెల్‌ఫోన్ నెట్‌వర్క్ కంపెనీలకు న్యూ ఇయర్ విషెస్ పేరిట రూ.5 కోట్ల ఆదాయం  సమకూరింది.
 
జిల్లాలో వినియోగమిలా...
జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు ఎయిర్‌టెల్, రిలయన్స్, వొడాఫోన్, ఐడియా, డొకోమో, యునినార్, ఎయిర్‌సెల్, టాటా ఇండికాం తదితర సంస్థలకు చెందిన  ఫోన్ వినియోగదారులు లక్షల్లో ఉన్నారు.  మామూలు రోజుల్లోనే ఒకరోజులో సుమారు ఒక కోటిన్నర రూపాయలకు పైగా  ఆయా కంపెనీలకు ఆదాయం సమకూరుతోందని అంచనా. అయితే నూతన సంవత్సరం  సందర్భంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి శుభాకాంక్షలు తెలపడం ప్రారంభమై..జనవరి 1వ తేదీ సాయంత్రం వరకు సుమారు సాగడంతో  విషెస్ కాల్స్, మేసేజ్‌లు వెల్లువెత్తాయి. వినియోగదారులు సైతం వ్యవయాన్ని తగ్గించుకునేందుకు గ్రీటింగ్ కార్డులకు బదులు వీటిపై ఆధారపడ్డారు. నూతన సంవత్సరం పురస్కరించుకుని బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్‌తో పాటు వివిధ నెట్‌వర్క్ కంపెనీలు..డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో తమ సంస్థలకు చెందిన ఏ రాయితీల ప్యాకేజీలు వర్కవుట్ కావని..సాధారణ కంపెనీ పాలసీ రేట్లుతోనే అమలవుతాయని  ముందుగానే ప్రకటించాయి. దీంతో శుభాకాంక్షల మెసేజ్ లు, కాల్స్ బిల్లు  తడిసిమోపెడయిందని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. 
 
బీఎస్‌ఎన్‌ఎల్ ఒక్కరోజు 
వినియోగం రూ. 2 కోట్లు పైనే!
ఇదిలా ఉండగా..నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన  బీఎస్‌ఎన్‌ఎల్‌కు  జిల్లాలో ఒక్క రోజు వ్యాపారం సుమారు రూ. 2 కోట్లు సమకూరినట్టు సంస్థకు చెందిన  ఓ ముఖ్య అధికారి తెలిపారు. సాధారణ రోజుల్లో తమ ఒక్క రోజు వ్యాపారం జిల్లాలో రూ.50 లక్షల వరకు ఉంటుందని..కొత్త సంవత్సరం రోజున వ్యాపారం పెరిగిందన్నారు. మిగిలిన సంస్థల ఆదాయాన్ని గమనిస్తే..రూ.3  కోట్లపై మాటేనని ఆయా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.  గతంలో ఎన్నడూ లేనంతగా..ఫోన్ శుభాకాంక్షలు వెల్లువెత్తాయని..ఫలితంగా..అంచనాలకు మించి..ఆదాయం సమకూరిందని సామాన్యులతో పాటు..నెట్‌వర్క్ కంపెనీల  ప్రతినిధులు చెబుతున్నారు.
 
మరిన్ని వార్తలు