వామ్మో..ఎంత అన్యాయం..!

23 Mar, 2019 09:57 IST|Sakshi
మార్ఫింగ్‌ జరిగిన కొన్ని  రేషన్‌ కార్డులు

సాక్షి, టెక్కలి: దారిద్య్ర రేఖకు దిగువ (బీపీఎల్‌)న గల పేదలకు ఆసరాగా ఉన్న రేషన్‌ కార్డులను తమకు అనుకూలంగా మార్చుకుని అందులో ఫొటోలను, ఇంటి పేర్లను సైతం మార్ఫింగ్‌ చేసి పెద్ద ఎత్తున రేషన్‌ కార్డుల అక్రమాలకు పాల్పడిన ఓ టీడీపీ ఎంపీటీసీ అక్రమాల భాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది. అక్రమాలకు పాల్పడిన ఎంపీటీసీ అధికార పార్టీకి చెందిన నేత కావడం..ఆయన తండ్రి రేషన్‌ డీలర్‌ కావడంతో  మంత్రి అచ్చెన్నాయుడు అండ వారికి పుష్కలంగా ఉంది. దీంతో పౌర సరఫరాల అధికారిని తమ గుప్పిట్లో పెట్టుకుని రేషన్‌ కార్డుల వ్యవస్థను పూర్తిగా అక్రమాల పుట్టగా మార్చేశారు. ఈ అక్రమాల భాగోతం అంతా ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. వివరాలిలా ఉన్నాయి. టెక్కలి మండలంలోని  చాకిపల్లి గ్రామంలో  టీడీపీ ఎంపీటీసీ పి.వసంత్‌ అధికారాన్ని అడ్డంపెట్టుకుని గ్రామంలో సుమారు 45 రేషన్‌ కార్డుల్లో లబ్ధిదారుల ఫొటోలు, వారి ఇంటి పేర్లు సహా మార్ఫింగ్‌కు పాల్పడ్డారు. తమ పార్టీకి అనుకూలంగా ఉన్న కొంత మంది వ్యక్తుల ఫొటోలు, ఇంటి పేర్లు మార్ఫింగ్‌ చేసి రెండేసి రేషన్‌ కార్డులను సృష్టించేశారు. 


పౌరసరఫరాల అధికారుల హస్తం?
ఒకే రేషన్‌ కార్డులో ఇంటి పేర్లు తారుమారుగా ఉన్నప్పటికీ పౌరసరఫరాల అధి కారులు కనీసం గుర్తించక పోవడం వెనుక పెద్దఎత్తున వారి హస్తం కూడా ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నా యి. అయితే రేషన్‌ కార్డుల మార్ఫింగ్‌కు పాల్పడిన టీడీపీ ఎంపీటీసీ తండ్రి అదే గ్రామంలో రేషన్‌ డీలర్‌ కావడంతో ఈ దొంగచాటు వ్యవహారం ఇన్నాళ్లూ బయటపడలేదు. గ్రామంలో కొంతమంది యువకులు రహస్యంగా ఈ వ్యవహారా న్ని బయట పెట్టడంతో తీగ లాగితే డొంక కదిలినట్లుగా మార్ఫింగ్‌ వ్యవహారం బయల్పడింది. రేషన్‌ కార్డుల మార్ఫింగ్‌తో గ్రామంలో కొంతమంది ఉద్యోగస్తుల పిల్లలను ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి అర్హులుగా చేసినట్లు తెలుస్తోంది. ఈ రేషన్‌ కార్డుల మార్ఫింగ్‌ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తే మరిన్ని అక్రమాలు బయట పడతాయేయోనని గ్రామంలో చర్చ జరుగుతోంది. 
 

మరిన్ని వార్తలు