కలుషితం లేని వార్తే ఛాయా చిత్రం: జస్టిస్ ఎన్‌వీ రమణ

20 Aug, 2013 01:17 IST|Sakshi

హైదరాబాద్, న్యూస్‌లైన్: కలుషితం లేని వార్తగా నిలిచేది ఛాయా చిత్రం ఒక్కటేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ అన్నారు. 174వ ప్రపంచ ఛాయా చిత్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఛాయా చిత్ర పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జస్టిస్ ఎన్‌వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, నేటి ఆధునిక యుగంలో అనేక న్యూస్ చానళ్లు ఉన్నప్పటికీ దిన పత్రికలు చదవడం తప్పనిసరి అవుతోందన్నారు.
 
 పత్రికల్లో చదివే వార్తా కథనం శీర్షికకు ఎంత ప్రాముఖ్యం ఉంటుందో ఫొటోకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. విలేకరి రాసిన వార్త కొంత కలుషితం అయ్యేందుకు వీలుంటుందని, పత్రికలో ప్రచురితమైన ఛాయాచిత్రంలో కలుషితం ఉండదని చెప్పారు. విషయాన్ని, భావాన్ని స్పష్టంగా చెప్పగలిగేది చిత్రమేనని, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం ఫొటోగ్రఫీయేనని తెలిపారు. తాను కూడా కొంత కాలం జర్నలిస్టుగా పని చేశానని జస్టిస్ రమణ చెప్పారు. ఫొటో జర్నలిస్టుల సాహసాలకు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్‌కు రూ. 25 వేల విరాళాన్ని ఆయన ప్రకటించారు.
 
 ‘సాక్షి’కి మొదటి బహుమతి
 ఈ సందర్భంగా నిర్వహించిన ఛాయా చిత్రాల పోటీలో మొదటి బహుమతి ఏ సతీష్(సాక్షి), ద్వితీయ బహుమతి కె.రమేష్ (హిందూ), తృతీయ బహుమతి ఎన్ శివకుమార్(పోస్ట్‌నూన్) గెలుచుకున్నారు. 15 మంది ఫొటోగ్రాఫర్లు కన్సొలేషన్ బహుమతులకు ఎంపికయ్యారు. కరువు సమస్యలపై ఏర్పాటు చేసిన పోటీలో మొదటి బహుమతి డీ హుస్సేన్(సాక్షి), ద్వితీయ బహుమతి జీ వెంకన్న(నమస్తే తెలంగాణ), తృతీయ బహుమతి బీ నర్సింహులు(ఆంధ్రజ్యోతి) గెలుపొందారు.
 
 వీరితో పాటు నలుగురు కన్సొలేషన్ బహుమతులకు ఎంపికయ్యారు. ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, సాక్షి క్వాలిటీసెల్ ఇన్‌చార్జ్ టీ కే లక్ష్మణ్‌రావు, ది హిందూ రెసిడెంట్ ఎడిటర్ కె.శ్రీనివాస్‌రెడ్డి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. సభలో ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు సోమసుందర్, ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి, సిలికాన్ రబ్బర్ ఎండీ కపిల్ అగర్వాల్‌తో పాటు ఏపీ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు కె.రవికాంత్ రెడ్డి, కార్యదర్శి కేఎన్ హరి, పత్రికల ఫొటో గ్రాఫర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు