గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో కొత్త టెర్మినల్‌

24 Apr, 2020 09:24 IST|Sakshi

సాక్షి, అమరావతి: గన్నవరం విమానాశ్రయంలో దేశీయ, విదేశీయ ప్రయాణికుల కోసం నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు (పీఐబీ) ఆమోదం తెలిపింది. సుమారు రూ.613 కోట్లతో నిర్మించనున్న ఈ టెర్మినల్‌ నిర్మాణానికి కేంద్ర కేబినెట్‌ ఇక లాంఛనంగా ఆమోదం తెలపాల్సి ఉంది. ప్రసుత్తం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పాత టెర్మినల్‌ భవనాన్ని ఇంటర్నేషనల్‌ కార్యకలపాలకు తాత్కాలికంగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు దీని స్థానంలో 31 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను నిర్మించడానికి ఇప్పటికే టెండర్లు పిలిచారు. 

ఐదు నిర్మాణ రంగ కంపెనీలు బిడ్డులు దాఖలు చేయగా అందులో ఒక కంపెనీ సాంకేతిక అంశాల విషయంలో తిరస్కరణకు గురైంది. మిగిలిన నాలుగు కంపెనీల్లో ఎన్‌కేజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ తక్కువ ధరను కోట్‌ చేయడం ద్వారా ఎల్‌1గా నిలిచినట్లు ఈ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న కీలక అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించగానే పనులు మొదలుపెట్టి రెండేళ్లలో టెర్మినల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు