స్థానిక కోర్టుల్లోనూ ‘పిల్’!

8 Dec, 2013 01:03 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్)ను కింది కోర్టుల్లోనూ విచారణకు స్వీకరించవచ్చని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతిసేన్‌గుప్తా వెల్లడించారు. ఇటీవల మరణించిన సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి స్మారక సభలో ‘సామాజిక న్యాయం-ప్రజా ప్రయోజన వ్యాజ్యం’ అనే అంశంపై శనివారం ఆయన కీలకోపన్యాసం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టులతోపాటు అన్ని న్యాయస్థానాల్లోనూ ఒకే న్యాయవ్యవస్థ ఉంటుందని, కాబట్టి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను కింది కోర్టుల్లోనూ స్వీకరించవచ్చని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించడానికి ‘పిల్’ ఉపయోగపడుతుందన్నారు. ‘పిల్’ ప్రధాన ధ్యేయం ప్రజా సమస్యల పరిష్కారమేనని, అదే సమయంలో ఏ ఒక్కరి ప్రయోజనం కాంక్షించే విధంగా అది ఉండకూడదని జస్టిస్ గుప్తా స్పష్టం చేశారు.

 

 పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు 1987లో న్యాయ సేవాధికార సంస్థలను ఏర్పాటు చేశారని తెలిపారు. సామాజిక అంతరాలను తొలగించేందుకు  ఆర్టికల్ 371-డి అధికరణ ఉపయోగపడుతుందని తెలిపారు. దీనిద్వారా సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. పద్మనాభరెడ్డి తనయుడు, హైకోర్టు జడ్జి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ పేదలకు సమాన న్యాయం గురించి నిత్యం ఆలోచించిన మానవతావాది పద్మనాభరెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి జి.చక్రధరరావు, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి, హైకోర్టు ఏపీపీ వినోద్‌దేశ్‌పాండే, నగర మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి ఆర్.మురళి, ఐఏఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మగాని ప్రభాకర్, ఐఏఎల్ కార్యనిర్వాహక అధ్యక్షుడు చలసాని అజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు