కబ్జాలకు కేరాఫ్ పీలేరు

20 Nov, 2013 02:23 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గం భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పీలేరుకు నాలుగువైపులా ఉన్న చిత్తూరు, తిరుపతి, రాయచోటి, మదనపల్లి రహదారులకు ఇరువైపులా రూ.200 కోట్లకు పైగా విలువజేసే వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. సీఎం ఆశీస్సులతో ఆయన సోదరుడే కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి ఇటీవల ఆరోపించగా, తాజాగా పలు కబ్జాలపై టీఆర్‌ఎస్ మంగళవారం ఏసీబీ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పీలేరు కబ్జాలు మరోమారు తెరపైకి వచ్చాయి.
 
  కబ్జాదారులు కాంగ్రెస్ నేతలు, సీఎం అనుచరులు కావడం వల్లే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాలుగు రహదారుల్లో బహిరంగంగా కనిపిస్తున్న కబ్జాలపై బుధవారం పీలేరు పర్యటనకు వస్తున్న సీఎం ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. పీలేరుకు ఆనుకొని ఉన్న ఎర్రగుంటపల్లె, దొడ్డిపల్లె, కాకులారంపల్లె, వేపులబైలు, ముడుపులవేముల, బోడుమల్లివారిపల్లె, గూడరేవుపల్లెలోని ప్రభుత్వ భూమలు, చెరువులు, కొండలు, వాగులు పెద్ద ఎత్తున కబ్జాలకు గురయ్యాయి. ఒక్క బోడుమల్లివారిపల్లెలోనే 70 కోట్ల రూపాయల విలువచేసే భూములు కబ్జా అయ్యాయని, వీటిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్వయంగా సర్పంచ్ రవీంద్రనాథరెడ్డి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. కబ్జాల నివారణకు ఆయన నిరాహారదీక్షకు సిద్ధమౌతున్నారు.
 
  ఎర్రగుంటపల్లెలో 14.76 ఎకరాల ప్రభుత్వ భూమి, చిత్తూరు రోడ్‌లోని ఆటోనగర్‌లో 15 ఎకరాలకు పైగా కొండ కబ్జా అయ్యాయి. అప్పలనాయు డు చెరువు సప్లై కాల్వ భూమిని కాంగ్రెస్‌కే చెందిన పీలేరు సర్పంచ్ హుమయూన్ కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారనే ఆరోపణలు వచ్చినా దానిపై అధికారులు స్పందించడం లేదు. కబ్జాలకు సహకరించిన మండల స్థాయి అధికారికి మూడు కోట్లకు పైగా ముడుపులు ముట్టాయని, కింది స్థాయి అధికారిణి ఒకరికి తిరుపతిలో కబ్జాదారులు రూ.50 లక్షలతో ఇంటిని కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారని ప్రచారం జోరుగా సాగుతోంది.
 
 మదనపల్లి రోడ్‌లోని బడబళ్లవంక, ఎన్‌జీవో హోం స్థలం, ఆర్ అండ్ బీ అతిథిగృహం స్థలాలను కూడా కబ్జాదారులు వదల్లేదు. సమైక్యాంధ్ర హీరోగా కాంగ్రెస్ నేతలు చెప్పుకొంటున్న కిరణ్‌కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఉద్యమం కంటే జోరుగా కబ్జాలే జరిగాయి. వీటిపై ఫిర్యాదులు వెళుతున్నా అధికారులు స్పందించడం లేదు. రచ్చబండకు వచ్చే ముఖ్యమంత్రి కబ్జాలపై ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.
 

మరిన్ని వార్తలు